ప్రమాద స్థాయికి సింగభూపాలెం చెరువు కట్ట

by Sridhar Babu |
ప్రమాద స్థాయికి సింగభూపాలెం చెరువు కట్ట
X

దిశ, కొత్తగూడెం రూరల్ : గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాద స్థాయికి సింగభూపాలెం చెరువు కట్ట చేరిందని, ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం జరగకుండా నీటిపారుదల శాఖ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే. సాబీర్ పాషా కోరారు. మండలంలోని సింగభూపాలెం చెరువు కట్ట, పరీవాహక ప్రాంతాలు, వ్యవసాయ భూములను మంగళవారం సీపీఐ ప్రతినిధి బృందం సందర్శించి పరిశీలించింది. ఈ సందర్బంగా సాబీర్ పాషా మాట్లాడుతూ చెరువు పరీవాహక రైతులు అధైర్య పడొద్దని సూచించారు. చెరువుకట్ట పరిస్థితిని ముందస్తుగానే గుర్తించి ఇటీవల స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు నీటి పారుదల శాఖా అధికారులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువుకట్టకు ఇలాంటి దుస్థితి ఏర్పడిందని రూ.26 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించి కుంగిపోతోందని, ఈ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాతో పాటు నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు నీటి పారుదలకు కూనంనేని కృషి చేస్తున్నారని, అదేవిధంగా చెరువును పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. అధిక వర్షాలవల్ల చెరువుకట్ట కృంగిపోయిందన్నారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని నీటిపారుదల అధికారులకు సూచించారు.

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు అధికారులు సర్వే చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి భూక్య దస్రు, జిల్లా సమితి సభ్యులు చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, కొమారి హన్మంతరావు, జక్కుల రాములు, తాళ్ల వెంకటేశ్వర్లు, నాయకులు భాగం శేషభూషణం, తాళ్లూరి పాపారావు, తాళ్లూరి ధర్మారావు, పొదిల శ్రీనివాసరావు, వీర్ల మల్లేష్, బొడ్డు కేశవరావు, కొమారి కృష్ణ, మూడు గణేష్, భాగం కృష్ణ, దండు నాగేశ్వరరావు, గడ్డం రాజేందర్, దండు సురేష్, ఆకుల వెంకన్న, శీలపోగు సురేష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed