గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంపులో నిబంధనలకు పాతర

by Disha Web Desk 15 |
గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంపులో నిబంధనలకు పాతర
X

దిశ, వైరా : వైరా మండలంలోని సోమవరం గ్రామ సమీపంలో సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూమిలో ప్రభుత్వ నిబంధనలకు పాతర వేసి మూడు సంవత్సరాల క్రితం గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఏర్పాటు చేసినా పట్టించుకునే వారే కరువయ్యారు. సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంపు స్థలంలో కేవలం నాలుగు ఎకరాలకు మాత్రమే ల్యాండ్ కన్వర్షన్ చేశారు. మిగిలిన 46 ఎకరాలకు ల్యాండ్ కన్వర్షన్ చేయలేదు. మూడు సంవత్సరాలుగా ల్యాండ్ కన్వర్షన్ చేయకపోయినప్పటికీ అధికారులు కనీసం పట్టించుకోవటం లేదనే విమర్శలు వినవస్తున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ నిబంధనలకు పాతర వేసి ప్రభుత్వ ఆదాయం 50 లక్షల రూపాయలకు టోకరా పెట్టారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా ఉపయోగించుకోవాలంటే ప్రభుత్వానికి నాలా చెల్లించాల్సి ఉంటుంది. అయితే నాలా చెల్లించకుండా వ్యవసాయ భూమి పేరుతోనే క్యాంప్ ఏర్పాటు చేశారు.

ఈ క్యాంపులో డాంబర్ మిక్సింగ్ ప్లాంట్, యారి బ్రిక్స్ ప్లాంట్, ఆర్ఎంసీ మిక్సింగ్ ప్లాంట్ తో పాటు పలు రకాల పరిశ్రమలను ఏర్పాటు చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే లో పనిచేసే అధికారుల నుంచి సిబ్బంది వరకు ఉండేందుకు తాత్కాలిక నివాసాలను, కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో ఎకరానికి సంవత్సరానికి 40 వేల రూపాయలు చొప్పున గ్రీన్ ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్ రైతులకు చెల్లిస్తున్నారు. ఈ వ్యవసాయ భూమికి కన్వర్షన్ చేయకపోవడంతో ఒకవైపు ప్రభుత్వం ఆర్థికంగా నష్టపోవటంతో పాటు సుమారు 46 ఎకరాలకు గత ఐదు వ్యవసాయ సీజన్లకు లక్షలాది రూపాయలు రైతుబంధు చెల్లిస్తున్నారు. దాంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూములకు నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటి వరకు రైతుబంధు కింద సుమారు 11 లక్షల రూపాయల నగదు చెల్లించారు.

ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా అధికారుల నిర్లక్ష్యం వల్ల మరోవైపు రైతుబంధు రూపేణా ప్రభుత్వ నగదు దుర్వినియోగం అవుతుంది. ఇటీవల వైరా మండల రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ చేయాలని గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంప్ ఇన్చార్జికి పలుసార్లు ఆదేశాలు జారీ చేసినా ఆ ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నారు. ఈ విషయమై వైరా తహసీల్దార్ కేవీ శ్రీనివాసరావును దిశ వివరణ కోరగా గ్రీన్ ఫీల్డ్ హైవే క్యాంపు ఏర్పాటు చేసిన వ్యవసాయ భూమికి కన్వర్షన్ చేయలేదని స్పష్టం చేశారు.

పలుసార్లు కన్వర్షన్ చేయాలని గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులను ఆదేశించినా కనీసం స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ల్యాండ్ కన్వర్షన్ చేయని గ్రీన్ ఫీల్డ్ హైవే అథారిటీ పై చర్యలు తీసుకొని రైతులకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయేతర భూములకు చెల్లించిన రైతుబంధు నగదును రికవరీ చేయాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed