వైరా నియోజకవర్గ చరిత్రలో రాందాస్ దే అత్యధిక మెజారిటీ

by Sumithra |
వైరా నియోజకవర్గ చరిత్రలో రాందాస్ దే అత్యధిక మెజారిటీ
X

దిశ, వైరా : నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 సంవత్సరంలో ఏర్పడిన వైరా నియోజకవర్గంలో ప్రస్తుత వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. వైరా నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో రాందాస్ నాయక్ 33,045 ఓట్ల మెజార్టీతో చరిత్రను సృష్టించారు. ఈ నియోజకవర్గంలో అత్యల్పంగా గత ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కు 2013 ఓట్లు మెజారిటీ లభించింది. అదేవిధంగా ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ కు వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అత్యధిక మెజారిటీ లభించింది. మదన్ లాల్ కు ఒక్క మండలంలో కూడా మెజార్టీ లభించకపోవడం విశేషం. కాంగ్రెస్ కు కొణిజర్ల మండలంలో అత్యధికంగా 9469 ఓట్ల మెజార్టీ లభించగా, జూలూరుపాడు మండలంలో అత్యల్పంగా 2467 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన సీపీఎం మూడు మండలాల్లో మూడు డిజిట్స్ ఓట్లకు పరిమితం కాగా, మరో రెండు మండలాల్లో నాలుగు డిజిట్స్ ఓట్లు లభించాయి.

మెజారిటీలో చరిత్ర సృష్టించిన రాందాస్ నాయక్..

వైరా నియోజకవర్గంలో తొలిసారి పోటీ చేసిన మాలోతు రాందాస్ నాయక్ ఓట్ల మెజార్టీలో చరిత్ర సృష్టించారు. 2009వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి మహాకూటమి తరపున పోటీ చేసిన సీపీఐ అభ్యర్థిని భానోత్ చంద్రావతి కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రామచంద్రనాయక్ పై 13,626 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ఇటీవల వరకు ఈ మెజారిటీ యే వైరా నియోజకవర్గంలో అత్యధికంగా ఉంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బానోత్ మదన్ లాల్ అప్పటి టీడీపీ అభ్యర్థి బానోత్ బాలాజీ నాయక్ పై 10,583 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన లావుడ్యా రాములు నాయక్, అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పై 2013 అత్యల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ పై 33,045 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. రాందాస్ నాయక్ సాధించిన మెజారిటీ వైరా నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయింది.

కొణిజర్లలో అత్యధికంగా.. జూలూరు పాడులో అత్యల్పంగా..

ఆదివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో వైరా నియోజకవర్గంలో కొణిజర్ల మండలంలో రాందాస్ నాయక్ అత్యధిక మెజారిటీ రాగా, జూలూరుపాడు మండలంలో అత్యల్ప మెజారిటీ లభించింది. బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ ఒక్క మండలంలో కూడా మెజార్టీ సాధించలేదు. కొణిజర్ల మండలంలో రాందాస్ నాయక్ 9469 ఓట్ల అత్యధిక మెజారిటీ లభించింది. జూలూరుపాడు మండలంలో 2467 ఓట్లతో అత్యల్ప మెజార్టీని రాందాస్ నాయక్ పొందారు. వైరా మండలంలో 8523, ఏన్కూరు మండలంలో 5950, కారేపల్లి మండలంలో 5530 ఓట్ల మెజార్టీ రాందాస్ నాయక్ కు దక్కింది. పోస్టల్ బ్యాలెట్ లో కూడా రాందాస్ నాయక్ కు 1104 ఓట్ల మెజారిటీ లభించింది. కొణిజర్ల మండలంలో కాంగ్రెస్ కు 24,617, బీఆర్ఎస్ కు 15,148 వైరా మండలంలో కాంగ్రెస్ కు 21,089, బీఆర్ఎస్ కు 12,566, ఏన్కూరు మండలంలో కాంగ్రెస్ కు 14,155, బీఆర్ఎస్ కు 8205, కారేపల్లి మండలంలో కాంగ్రెస్ కు 20,283, బీఆర్ఎస్ కు 14,753, జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ కు 12,253, బీఆర్ఎస్ కు 9786 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయక్ కు పోస్టల్ బ్యాలెట్లు 1516 లభించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ కు 412 మాత్రమే వచ్చాయి.

సీపీఎంకు వచ్చిన ఓట్లు 4439

వైరా నియోజకవర్గంలో ఒంటరిగా పోటీ చేసిన సీపీఎం పార్టీకు 4439 ఓట్లు మాత్రమే లభించాయి. ఈ పార్టీకి అత్యధికంగా కొణిజర్ల మండలంలో 1447, అత్యల్పంగా జూలూరు పాడు మండలంలో 482 ఓట్లు లభించాయి. వైరా మండలంలో 1192, కారేపల్లి మండలంలో 781, ఏన్కూరు మండలంలో 499 ఓట్లు మాత్రమే లభించాయి. అదేవిధంగా సీపీఎం అభ్యర్థి భూక్యా వీరభద్రంకు 38 పోస్టల్ బ్యాలెట్లు లభించాయి.

Advertisement

Next Story