Bhadradri : భద్రాద్రిలో రామాలయం పరిసరాలు మునక

by Sridhar Babu |
Bhadradri : భద్రాద్రిలో రామాలయం పరిసరాలు మునక
X

దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణంలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో బుధవారం ఉదయం రామాలయం పరిసర ప్రాంతాలు విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం, ప్రధాన మెట్ల వద్దకు మూడు అడుగుల మేర వరద నీరు చేరుకుంది. పలు కాలనీలను సైతం వరద నీరు చుట్టుముట్టింది. వెంటనే స్పందించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డీవో దామోదర్ రావు ఇరిగేషన్ అధికారులను ఆదేశించడంతో భారీ మోటార్ల ద్వారా వరద నీటిని గోదావరిలోకి పంపారు. దీంతో గండం గడిచింది. కలెక్టర్ స్వయంగా వరద ముంచెత్తిన ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. భద్రాచలం రంగనాయక స్వామి గుట్టపై ఉన్న శ్రీ కుసుమ హరినాథ్ బాబా ఆలయ కళ్యాణ మండపం భారీ వర్షానికి కుంగిపోయి

పక్కకు ఒరిగి కూలడానికి సిద్ధంగా ఉండడంతో, కలెక్టర్ సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించడంతో, ఐటీసీ కి చెందిన ప్రత్యేక బృందం మండపాన్ని కూల్చివేసి ప్రమాదం నుంచి ప్రజలను కాపాడారు. కూలిన మండపం సగానికి విరిగి అక్కడే పడిపోయింది. రాత్రి 9:00 కావడంతో మిగిలిన పనులు గురువారం చేపడతామని ప్రత్యేక బృందం పేర్కొంది. ఇదిలా ఉండగా తెలంగాణ, చత్తీస్​ఘడ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో తాళి పేరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. 24 గేట్లు ఎత్తి 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. కిన్నెరసాని ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు వచ్చి

చేరడంతో 17 గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డీవో దామోదర్ రావు, రామాలయం ఈవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ సంజీవరావు, ఎస్ ఐ లు విజయలక్ష్మి, మధు ప్రసాద్, టెంపుల్ ఈఈ రవీందర్ బుధవారం ఉదయం నుండి వర్షంలోనే విధులు నిర్వహిస్తూ, భారీ విపత్తు నుండి ప్రజలను కాపాడారు. చర్ల రోడ్డులో డ్రైనేజీలో వాటర్ బాటిల్స్ సేకరించడానికి వెళ్లిన సతీష్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో జారి పడటంతో డ్రైనేజీ నాలాలో ఇరుక్కుని అక్కడే మృతి చెందాడు. ఎన్డీ ఆర్ ఎఫ్, రెస్క్యూ, పోలీసులు మూడు గంటలు కష్టపడి మృతదేహాన్ని వెలికి తీశారు.

Advertisement

Next Story

Most Viewed