వైరాను ముంచెత్తిన వరద.. రికార్డు స్థాయిలో కురిసిన వర్షం

by Bhoopathi Nagaiah |
వైరాను ముంచెత్తిన వరద.. రికార్డు స్థాయిలో కురిసిన వర్షం
X

దిశ, వైరా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షం వైరాను ముంచెత్తుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఎన్నడూ లేని విధంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు వైరా మండలంలో 23.76 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఈదురు గాలులు మెరుపులు ఉరుములతో నిరంతరాయంగా భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం నల్లచెరువు అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న వైరాలోని ఇందిరమ్మ కాలనీ జలమయమైంది. వరద నీరు ఇందిరమ్మ కాలనీ ను ముంచెత్తటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ కాలనీలోకి వరద నీరు ప్రవహిస్తున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచే అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించారు. వైరా, కొణిజర్ల మండలాల్లో వాగులు వంకలు పొంగిపొర్లి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి నీటిమట్టం 20.4 అడుగులకు చేరుకుంది. దీంతో రిజర్వాయర్ కు ఉన్న 5 అలుగుల ద్వారా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ వైరా నదిలోకి చేరుతుంది. దీంతో వైరా నది పొంగి పొర్లుతుంది.

అర్ధరాత్రి అప్రమత్తమైన అధికారులు

మండలంలోని సోమవారం నల్లచెరువు అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వైరాలోని ఇందిరమ్మ కాలనీ నీట మునిగింది. వైరా సీఐ నున్నావత్ సాగర్, తహసీల్దార్ కేవీ. శ్రీనివాసరావు, ఎస్సై ఏ.వంశీకృష్ణ భాగ్యరాజు, మున్సిపాలిటీ కమిషనర్ చింతా వేణు, వైరా అగ్నిమాపక కేంద్ర అధికారి అమర్నేని శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు సూర్యదేవర శ్రీధర్ శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఇందిరమ్మ కాలనీలోనే ఉండి సహాయక చర్యలు చేపట్టారు. ఈ కాలనీలో ఇల్లు నీట మునిగిన 70 కుటుంబాల వారిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఇళ్ల నుంచి బయటకు తీసుకువచ్చి వైరాలోని బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి వైరా మండలంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ వైరా డిఈ శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు వైరా రిజర్వాయర్ నీటిమట్టాన్ని పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. వర్షంలో సైతం తడుచుకుంటూ అధికారులు శనివారం అర్ధరాత్రి నుంచి సహాయక చర్యలు చేయబడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

పలు గ్రామాలకు రాకపోకలు బంద్

భారీ వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో వైరా కొణిజర్ల మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని లో లెవెల్ వంతెన పైనుంచి, గన్నవరం గ్రామ సమీపంలో ఉన్న లో లెవెల్ వంతెన పైనుంచి వైరా నది ఉదృతంగా పొంగి ప్రవహిస్తుంది. దీంతో స్నానాల లక్ష్మీపురం - సిరిపురం, రెండు రాష్ట్రాలను అనుసంధానం చేసే గన్నవరం - నెమలి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గంగదేవి పాడు వాగు పొంగి పొర్లటంతో పుణ్యపురం సిరిపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వల్లాపురం గ్రామంలో రోడ్డుపై నుంచి రాళ్లవాగు ప్రవహించటంతో పాలడుగు - వల్లా పురం గ్రామాలకు రాకపోకల నిలిచిపోయాయి.

పాలడుగు గన్నవరం గ్రామాల మధ్య వాగు ప్రవహించటంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అదేవిధంగా మండలంలో గంగదేవిపాడు వాగు పొంగి ప్రవహిస్తుంది. కొణిజర్ల మండలంలో తీగల బంజర లాలాపురం గ్రామాల మధ్య పగిడేరు వాగు, అంజనాపురం జన్నారం గ్రామాల మధ్య జన్నారం వాగు రోడ్డుపై ప్రవహించటంతో పల్లిపాడు - ఏన్కూరు గ్రామాల మధ్య ఉన్న ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పగిడేరు వాగులో వరద ప్రవాహం వల్ల మల్లుపల్లి - కొణిజర్ల, తుమ్మలపల్లి - అన్నవరం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాళ్లవాగు రోడ్డుపై నుంచి ప్రవహించటంతో సాలెబంజార - మల్లుపల్లి గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు నిర్మానుషంగా మారాయి. ఈదురు గాలులు మెరుపులు ఉరుములతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

Advertisement

Next Story

Most Viewed