సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫోర్జరీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం

by Sridhar Babu |
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫోర్జరీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం
X

దిశ, వైరా : వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. నకిలీ డెత్ సర్టిఫికెట్లను తయారు చేసి ఆ సర్టిఫికెట్ల ఆధారంగా తప్పుడు ఇంటి రిజిస్ట్రేషన్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సుమారు రెండున్నర నెలల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిబంధనల ప్రకారం హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. కనీసం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా కేవలం లాయర్ నోటరీతో, నకిలీ డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా ఇంటి రిజిస్ట్రేషన్ చేయడం కలకలం రేపుతుంది. కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన గంధం నగేష్ కు అతని తల్లిదండ్రుల పేరుతో సృష్టించిన నకిలీ డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా ఆయన సోదరీమణులు ఇంటి రిజిస్ట్రేషన్ చేయటం వివాదాస్పదంగా మారింది.

గంధం నరేష్ తండ్రి గంధం గోపయ్య, తల్లి గంధం మరియమ్మ సుమారు 20 సంవత్సరాల క్రితం మృతి చెందారు. గంధం గోపయ్య పేరుతో పల్లిపాడు గ్రామంలో 6-64 నెంబర్ తో ఇల్లు ఉంది. అయితే ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు నగేష్ తల్లిదండ్రులకు డెత్ సర్టిఫికెట్లు లేవు. దీంతో కొంతమంది మధ్యవర్తులు ఓ ప్యాకేజీ తీసుకొని నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి ఇంటిని నగేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. హైదరాబాద్ లోని ఇమేజ్ హాస్పిటల్ లో నగేష్ తల్లిదండ్రులు మృతి చెందినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించారు. 2019 అక్టోబర్ 12వ తేదీన గంధం గోపయ్య, 2017 నవంబర్ 15వ తేదీన గంధం మరియమ్మ మృతిచెందినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్లు తయారు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ లోని ఖైరతాబాద్ సబ్ రిజిస్టార్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అధికారి బి.భరత్ బాబు ఈ డెత్ సర్టిఫికెట్లను మంజూరు చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేశారు. సదరు అధికారి 2019 నవంబర్ 12న గంధం గోపయ్యకు, 2017 డిసెంబర్ 12న గంధం మరియమ్మకు డెత్ సర్టిఫికెట్ మంజూరు చేసినట్లు సృష్టించారు. ఈ సర్టిఫికెట్ల ఆధారంగా నగేష్ కు ఆయన సోదరీమణులు కొత్తపల్లి జ్యోతి, కంకణాల శేషమ్మ, తగరం మారతమ్మ 206.11 చదరపు గజాల స్థలంలో 6-64 నెంబర్ తో ఉన్న ఇంటిని డాక్యుమెంట్ నెంబర్ 2985/2024 తో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్

సబ్ రిజిస్ట్రార్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన కుమారుడికి కుమార్తెలు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాలంటే హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అధికారులు హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయకుండా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్ లేకుండా కేవలం లాయర్ నోటరీ తో ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం విశేషం. అనేకమంది సీనియర్ అధికారులు, డాక్యుమెంట్ రైటర్లు ఈ రిజిస్ట్రేషన్ చెల్లదని చెబుతున్నారు. హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ స్థానంలో గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఫోర్జరీ డెత్ సర్టిఫికెట్ల సృష్టికర్త ఎవరు.....

ఇంటి రిజిస్ట్రేషన్ కోసం ఫోర్జరీ డెత్ సర్టిఫికెట్లు తయారుచేసిన వారు ఎవరనే ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు అక్రమ ధనార్జనే ధ్యేయంగా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంటి రుణాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దళారులు అందినకాడికి దండుకొని ఇలాంటి ఫోర్జరీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత బరితెగించి గ్రేటర్ హైదరాబాద్ ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి సర్టిఫికెట్లు తయారు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

అయితే గంధం నగేష్ రిజిస్ట్రేషన్ ను కొణిజర్ల మండలం తీగల బంజరకు చెందిన డాక్యుమెంట్ రైటర్ రామిశెట్టి కిరణ్ చేయించారు. అయితే ఆ డాక్యుమెంట్ రైటర్ కు ఆ సర్టిఫికెట్లు నకిలీవని తెలవదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ కు బదులు సదరు డాక్యుమెంట్ రైటర్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ను ఎలా చేయించారని, అధికారులు ఎలా చేశారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయమై డాక్యుమెంట్ రైటర్ రామిశెట్టి కిరణ్ ను దిశ వివరణ కోరగా గంధం నగేష్ ఇంటి రిజిస్ట్రేషన్ చేయించింది తానేనని స్పష్టం చేశారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ కు జతచేసిన డెత్ సర్టిఫికెట్లు నకిలీవని తనకు తెలియదని పేర్కొన్నారు. హక్కు విడుదల దస్తావేజు రిజిస్ట్రేషన్ కు బదులు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించావని ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు.

Advertisement

Next Story

Most Viewed