108 అంబులెన్సులో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం..

by Sumithra |
108 అంబులెన్సులో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం..
X

దిశ, కూసుమంచి : పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళ 108 అంబులెన్సులో ప్రసవించిన సంఘటన కూసుమంచి మండలంలో గురువారం చోటుచేసుకుంది. అంబులెన్స్​‍ ఈఎంటీ అంబాల రాణి తెలిపిన వివరాల ప్రకారం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన ఏ.శిరీషకు గురువారం తెల్లవారుజామున పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 108 కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. కాగా 108 సిబ్బంది నాయకన్ గూడెం గ్రామానికి చేరుకొని శిరీష ను అంబులెన్స్ లో ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాత శిశు కేంద్రానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో శిరీషకు పురిటి నొప్పులు అధికం అయ్యాయి.

దీంతో అంబులెన్స్ ను పక్కకు ఆపిన సిబ్బంది ఈఎంటి అంబాల రాణి, గర్భిణీ కుటుంబ సభ్యుల సాయంతో డెలివరీ చేయగా అంబులెన్స్ లోనే శిరీష ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈమెకు ఇది రెండవ సంతానం కాగా తల్లీ బిడ్డ ఇరువురు క్షేమంగా ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం శిరీషను, శిశువును మెరుగైన చికిత్స కొరకు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ సందర్భంగా సమయస్పూర్తితో గర్భిణీకి సుఖప్రసవం చేసిన 108 అంబులెన్స్ ఈఎంటి అంబాల రాణి, పైలెట్ బీ.శ్రీనులకు, అంబులెన్స్ సిబ్బందికి శిరీష కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed