జీవనోపాధికి వెళ్తూ.. అనంతలోకాలకు

by Mahesh |   ( Updated:2023-06-04 07:35:37.0  )
జీవనోపాధికి వెళ్తూ.. అనంతలోకాలకు
X

దిశ, వైరా: తన కుటుంబ జీవనోపాధి కోసం వెళుతున్న ఓ వ్యక్తిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి మరొక ద్విచక్ర వాహనం మృత్యు శకటంలా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వైరా లోని వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలోని జస్వంత్ ఫీలింగ్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొణిజర్ల మండలం పల్లిపాడు గ్రామానికి చెందిన కొండా సత్యం(47) దుర్మరణం చెందాడు. సత్యం గ్రామాల్లో తిరుగుతూ జల్లి బుట్టలు, చాటలు విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తల్లాడ మండలం అంజనాపురం లో జల్లిబుట్టలు, చాటలు తయారు చేస్తుంటారు. అయితే అంజనాపురంలో చాటలు కొనుగోలు చేసేందుకు తన ద్విచక్రవాహనంపై సత్యం ఆదివారం ఉదయం పల్లిపాడు గ్రామం నుంచి బయలుదేరారు.

బుల్లెట్ పై వెలుతున్న వ్యక్తి వైష్ణవి మిల్ ఫ్యాక్టరీ సమీపంలోని జస్వంత్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద వైరా వైపు వెళ్తున్న సత్యం ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టింది. దీంతో సత్యం తన బైక్ పై నుంచి 20 మీటర్ల దూరం రోడ్డుపై ఎగిరి పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బులెట్ పై ఉన్న అన్నదమ్ములు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు వైరా లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స నిర్వహించి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన జీవనోపాధి లో భాగంగా చాటలు కొనుగోలు చేసేందుకు బయలుదేరిన సత్యం మృతి చెందడంతో ఆయన కుటుంబంతో పాటు పల్లిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య గోవిందమ్మ, కుమారుడు సురేష్, కుమార్తె చైతన్య ఉన్నారు. కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More: దారుణం : వ్యక్తి తలపై బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య

Advertisement

Next Story