ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: కలెక్టర్ రవినాయక్

by Shiva |
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలి: కలెక్టర్ రవినాయక్
X

దిశ, పాలమూరు: మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.రవి నాయక్ అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్, ప్రవర్తన నియమావళి, పోలింగ్ కేంద్రాలు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 16 న నోటిఫికేషన్ విడుదల చేశామని, ఆ రోజు నుంచి ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 24న నామినేషన్ల పరిశీలన, 27 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మార్చి 13న పోలింగ్ ఉంటుందని, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాల్సిందిగా ఆయన కోరారు.

కోడ్ అమలులోకి వచ్చినందున వెంటనే వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు అన్ని తీసివేయాలని తాహసీల్దారులు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రవర్తన నియమావళిలో ఉండే అన్ని అంశాలను నిబంధనలను తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, 3,567 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ అర్బన్ లో ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న దృష్ట్యా మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే విషయమై ఎన్నికల సంఘానికి నివేదించినట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు.

సమావేశానికి హాజరైన నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యులు సాయిబాబా మాట్లాడుతూ.. కోడ్ అమలులోకి వచ్చినందున తక్షణమే పట్టణంలో అన్ని ఫ్లెక్సీలు బ్యానర్లు, హోర్డింగులు తీసివేయాలని కోరారు. అదే విధంగా పోలింగ్ రోజున మార్పులు చేర్పులతో కూడిన ఓటర్ జాబితాను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఆర్డీవో అనిల్ కుమార్, మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ పార్థసారథి, ఎలక్షన్ సెక్షన్ సూపరింటిండెంట్ అఖిల ప్రసన్న, జాఫర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ ఎం.సాయిబాబా, వై.విజయకుమార్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సత్యంయాదవ్, రాములు యాదవ్, సీపీఎం నాయకులు జీ.నరసింహులు, జి.రాజ్ కుమార్, సీపీఐ నాయకులు బీఆర్.విల్సన్, బీజేపీ నాయకులు మహేష్ కుమార్, ఎంఐఎం నుంచి మహమ్మద్ అబ్దుల్ హాది, సయ్యద్ సదాతుల్లా, వైఎస్ఆర్సీపీ నాయకులు బీ.డీ.శామ్యూల్, బీఎస్పీ నాయకులు లక్ష్మయ్య, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Next Story

Most Viewed