తోగ్గూడెంలో మైనింగ్ మాఫియా.. విచ్చలవిడిగా తవ్వకాలు..

by Sumithra |
తోగ్గూడెంలో మైనింగ్ మాఫియా.. విచ్చలవిడిగా తవ్వకాలు..
X

పాల్వంచ మండలంలోని తోగ్గూడెంలో విచ్ఛలవిడిగా జరుగుతున్న మైనింగ్ మాఫియాను అడ్డుకునే నాథుడే లేకుండా పోతున్నాడు. అనుమతులు ఎంత ? తవ్వకాలు చేస్తున్నది ఎంత ? మైనింగ్ కు అన్ని శాఖల నుంచి అనుమతులు ఉన్నాయా ? ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తున్నారా ? మైనింగ్ చేసిన ప్రాంతాన్ని ఫిల్ చేస్తున్నారా ? ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు ? అసలు ఆ దిక్కుకు చూసే ధైర్యం ఎవరికన్నా ఉందా ? అన్న ప్రశ్నలకు వివిధ శాఖల అధికారుల వద్దే సమాధానాలు లేవు. మూడు రోజుల క్రితం ‘దిశ’లో కథనం ప్రచురితం కాగానే.. సదరు మైనింగ్ నిర్వాహకులు స్థానిక విలేకరికి ఫోన్ చేసి క్వారీలో బొందపెడతామని హెచ్చరించాడు. అంతేకాదు అన్ని శాఖల అధికారులు, రాజకీయ నాయకులు తమ చెప్పుచేతల్లో ఉన్నారని, తమ జోలికి వస్తే ప్రాణాలు తీస్తామని హూంకరించడం విశేషం.

దిశ బ్యూరో, ఖమ్మం : అక్కడంతా మైనింగ్ మాఫియా రాజ్యం. వారి ఆగడాలకి అడ్డే లేదు, రెవెన్యూ, అటవీ భూములను ఆక్రమించి మైనింగ్ చేపట్టినా, పదుల సంఖ్యలో కేసులైనా, కోట్ల కొద్ది పెనాల్టీ పెండింగ్లో ఉన్న, ప్రభావిత గ్రామాల్లో ఇండ్లు కూలేందుకు సిద్ధంగా ఉన్నా, అధికారులకు వెళ్లి ఫిర్యాదు చేసినా, అక్రమ మైనింగ్ ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదు. పాల్వంచ మండలం తోగ్గూడెంలో క్వారీలో పేలుళ్ల ధాటికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. తోగ్గూడెం, తండా, క్యాంప్ ప్రాంతాల్లో ప్రజలు నివసిస్తూ ఉంటారు. బ్లాస్టింగ్ సమయంలో బాంబుల పేలుడు ధాటికి ఈ మూడు గ్రామాల్లోని ఇండ్లు కంపనాలకు గురై స్లాబ్ లు పెచ్చులు ఊడి పడటం, గోడలకు పగుళ్లు వచ్చి బీటలు వారుతున్నాయి. దీంతో అక్కడి ఆదివాసి, గిరిజన ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తమ ఇండ్లు ఎప్పుడు కూలుతాయో అర్థం కాక భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. దశాబ్దాల కాలంగా తమ తాతల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, ఈ అక్రమ మైనింగ్ మొదలైనప్పటినుండే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటివరకు ఏ అధికారి తమ గ్రామాల్లో వచ్చి పర్యటించలేదని, తమ సమస్యలను తీర్చే నాధుడే లేరని తమగోడుని వెళ్ళచ్చుతున్నారు. అక్రమ మైనింగ్ ని ఆపేయాలని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ కి, ఐటీడీఏ పిఓకి ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు.

రోజుకు రెండు కోట్ల వ్యాపారం..

తోగ్డూడెంలో మైనింగ్ చేస్తున్న వ్యాపారులు రాయల్టీ కట్టకుండానే అక్రమంగా రోజుకి రెండు కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. పిసా చట్ట ప్రకారం ఏజెన్సీ ఏరియాలలోని మైనింగ్ నిర్వహిస్తున్న ప్రాంతాల్లో ఐటీడీఏ 6 నెలలకి ఒకసారి గ్రామసభ నిర్వహించి, తీర్మానం చేయాలి. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో క్వారీలను తనిఖీ చేసి, రాయల్టీ సొమ్మును ప్రభుత్వానికి కట్టించే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ తోగ్గూడెం మైనింగ్ క్వారీలలో రాయల్టీ కాదు కదా, గ్రామపంచాయతీకి పన్ను రూపంలో ఒక రూపాయి కూడా చెల్లించట్లేదని సమాచారం. ఎనిమిది క్వారీలు, ఆరు క్రషర్ మిల్లులు నిర్వహిస్తున్నప్పటికీ, ఏ ఒక్కటి కూడా నిబంధనల ప్రకారం నిర్వహించడం లేదు. ప్రతిరోజు 100 నుండి 150 టిప్పర్ల కంకరను మూడు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఛత్తీస్ గడ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు ఇక్కడ నుంచే కంకర సరఫరా అవుతుంది.

బ్లాస్టింగ్ ల కారణంగా ముగ్గురి మృతి..

తోగ్గూడెం మైనింగ్ లో బ్లాస్టింగ్ చేపట్టే సమయంలో గతంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని తెలుస్తుంది. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే బ్లాస్టింగ్ సమయంలో మూడు ఘటనల్లో వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఇక పశువుల సంగతి అయితే వీరికి లెక్కేలేదు. పోయిన ప్రాణాలకు సెటిల్ మెంట్లు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. క్వారీల చుట్టూ ఎటువంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడంతో అడవిలో మేత కి వచ్చిన పశువులు వందల ఫీట్ల పైనుంచి క్వారీలో పడి చనిపోయిన సంఘటనలు కోకొల్లలు. వందల ఫీట్ల లోతులో అక్రమ మైనింగ్ చేపట్టడంతో, ఆ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ ల మేరకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి, దీంతో బోర్లు పడక చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

లాభాలు గిరిజనేతరులకి, కేసులు గిరిజనుల పై..

దమ్మపేట, ఇల్లందు, టేకులపల్లి వంటి దూర ప్రాంతాలకు చెందిన అమాయక గిరిజనుల పేరుమీద లీజులు తీసుకొని గిరిజనేతరులు అక్రమంగా మైనింగ్ నడుపుతున్నట్లు సమాచారం. వీరికి మాయమాటలు చెప్పి వారి పేరు మీద మైనింగ్ లీజులకు పర్మిషన్ తీసుకొస్తారు. వచ్చిన లాభమంతా గిరిజనేతరులు కోట్లల్లో జేబులో నింపుకొని, ప్రభుత్వం విధించే కోట్ల రూపాయల జరిమానా మాత్రం గిరిజనులకి అంటగడుతున్నారు. ఒకవేళ ఈ అక్రమ మైనింగ్ చేసే గిరిజనేతరులు, ఈ వందల కోట్ల రూపాయల జరిమానా కట్టకపోతే, ఆ భారం అంతా ఈ గిరిజనుల మెడకే చుట్టుకుంటుంది. ఇటీవల ఈ జరిమానా విషయంలో నోటీసు రావడంతో సదరు గిరిజనులు కోర్టుకి కూడా హాజరైనట్టు సమాచారం.

హద్దులు లేకుండా అక్రమ వ్యాపారం..

తోగ్గూడెం క్వారీలో మైనింగ్ నిర్వహించే వ్యాపారులకు హద్దులు, ఎల్లలు అంటూ ఏమి ఉండవు. వీరు మైనింగ్ అనుమతులు తెచ్చుకునేది కొంత ప్రాంతానికే , కానీ మైనింగ్ నిర్వహించేది మాత్రం వారి ఇష్టానుసారం. ఇప్పటికే సుమారు 30 ఎకరాల ఫారెస్ట్, రెవెన్యూ భూములను అక్రమంగా తవ్వి మైనింగ్ నిర్వహించారని తెలుస్తుంది. ఏకకాలంలో ఫారెస్ట్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే తప్ప అక్కడ ఏం జరిగిందనేది, ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ అంతుచిక్కదు. ఇంత జరిగుతున్నా అధికారులు ఈ మైనింగ్ ని ఎందుకు నిలుపుదల చేయడం లేదని మిలియన్ డాలర్ల ప్రశ్న.

క్వారీలో బొందపెడతాం..

మూడు రోజుల క్రితం ‘దిశ’ పత్రికలో కథనం రావడంతో సదరు నిర్వాహకులు స్థానిక విలేకరికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. సంవత్సరం మొత్తం రాసుకున్నా.. ఎవరూ ఏమీ పీకలేరని, ప్రతీనెల అధికారులకు మామూళ్ల పడేస్తున్నామని చెప్పుకొచ్చాడు. పనిలో పనిగా రాజకీయ నాయకులను ఇందులో లాగేసాడు. క్వారీలోకి అడుగుపెట్టాలంటే విలేకరులు బెదిరి చస్తారని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, లేదంటే క్వారీలో బొంద పెడతామని హెచ్చరించడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed