మూతపడ్డ ఆక్సిజన్ జనరేటర్లు.. విడి భాగాల కొరతతో మూలనపడ్డ యంత్రాలు

by Anjali |   ( Updated:2024-07-09 07:30:22.0  )
మూతపడ్డ ఆక్సిజన్ జనరేటర్లు.. విడి భాగాల కొరతతో మూలనపడ్డ యంత్రాలు
X

దిశ, కొత్తగూడెం: కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో సింగరేణి సంస్థ కార్మికుల కోసం ఆక్సిజన్ జనరేటర్ లను ఏర్పాటు చేసింది. భూపాలపల్లి, గోదావరిఖని, కొత్తగూడెం, రామకృష్ణాపురం,బెల్లంపల్లి ప్రాంతాలలో సింగరేణి ఆసుపత్రులలో సుమారు రెండు కోట్ల వ్యయంతో సంస్థ జనరేటర్లని ఏర్పాటు చేసింది. జర్మనీకి చెందిన ల్యాండ్ స్కై కంపెనీ ద్వారా ఈ ఆక్సిజన్ జనరేటర్లను సంస్థ కొనుగోలు చేసింది. కరోనా రెండవ వేవ్ సమయంలో ఈ ఆక్సిజన్ జనరేటర్లు కరోనా బారిన పడ్డ వారికి ఆక్సిజన్ అందించేందుకు ఎంతగానో ఉపయోగపడ్డాయి.ఆ తర్వాత కూడా పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఈ యంత్రాలు ఉపయోగపడ్డాయి. గత కొద్ది కాలంగా ఆక్సిజన్ జనరేటర్ల రూంలు నిరుపయోగంగా ఉండి తాళాలకు పరిమితమయ్యాయి.

విడి భాగాల కొరతతో మూలనపడ్డ ఆక్సిజన్ జనరేటర్లు

గత కొన్ని రోజుల నుంచి 5 ప్రాంతాల్లోని ఆక్సిజన్ జనరేటర్లు మూలనపడ్డాయి. ల్యాండ్ స్కై కంపెనీ విడి భాగాలను సరఫరా చేయకపోవడంతోనే యంత్రాలు మూలన పడ్డట్టు తెలుస్తుంది. సింగరేణి అధికారులు జనరేటర్ విడి భాగాల కోసం ఆర్డర్ పెట్టి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సదరు కంపెనీ నుంచి ఎటువంటి స్పందన లేదు. జర్మనీ నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకోవాల్సి ఉందని సింగరేణి అధికారులు చెబుతున్నారు.ఆక్సిజన్ జనరేటర్ల మెయింటెనెన్స్ మొత్తం ల్యాండ్ స్కై కంపెనీకి అప్పజెప్పారు.

అయినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో విడి భాగాలు సమయానికి చేరడం లేదు.దీంతో ఆక్సిజన్ సిలిండర్లను సింగరేణి సంస్థ అధికారులు బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో ప్రతిరోజు 20నుంచి 25ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉండగా, ఇప్పుడున్న ఆక్సిజన్ జనరేటర్లకు 15సిలిండర్ల వరకు సరఫరా చేసే సామర్థ్యం ఉంది. బయట నుంచి సిలిండర్లను కొనుగోలు చేసే బదులు ఉన్న ఆక్సిజన్ జనరేటర్ లను వినియోగంలోకి తెస్తే బాగుంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. రెండు కోట్ల రూపాయల సింగరేణి సంస్థ ధనాన్ని వెచ్చించి, సింగరేణి ప్రాంతాలలోని ఐదు చోట్ల ఈ ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి మూతపడడంతో ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లు వీటిని వినియోగంలోకి తేవాలని కోరుకుంటున్నారు.

కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఉండడంతో సింగరేణి వ్యాప్తంగా ఐదు చోట్ల ఈ ఆక్సిజన్ జనరేటర్ లను ఏర్పాటు చేశాం. విడి భాగాల కొరతతో అన్నిచోట్ల ఈ ఆక్సిజన్ జనరేటర్లు మూతపడ్డాయి. విడిభాగాల కోసం ఆర్డర్ పెట్టాం, అవి రాగానే జనరేటర్లకు అమర్చి ఉపద్రవాల సమయంలో, ఆక్సిజన్ అధికంగా అవసరం ఉన్న సమయంలో ఆక్సిజన్ జనరేటర్లను వినియోగంలోకి తెస్తాం. ఆక్సిజన్ జనరేటర్ ద్వారా వచ్చే ఆక్సిజన్ వ్యయం చాలా ఎక్కువ.

చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుజాత

Advertisement

Next Story

Most Viewed

    null