‘పంట నష్ట పరిహారంలో అవకతవకలు జరిగింది వాస్తవమే’

by Aamani |
‘పంట నష్ట పరిహారంలో అవకతవకలు జరిగింది వాస్తవమే’
X

దిశ, వైరా : ఈ ఒక్కసారికి ఆలోచించండి.... పంట నష్టపరిహారంలో అవకతవకలు జరిగింది వాస్తవమే.... భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగనివ్వం... వర్షాలకు దెబ్బతిన్న రైతుల పంటలను ఇప్పుడు మేము పరిశీలించిన నష్టపరిహారం రాదు. మేమిద్దరం ఈ ప్రాంతానికి కొత్తే. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి.... రైతులకు మరింత సేవలు అందిస్తామంటూ వైరా ఏ డి ఏ కరుణ శ్రీ, ఏవో మంజు ఖాన్ రైతులను సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ చేశారు. వైరా మండలంలో పంట నష్టపరిహారం లో జరిగిన అవకతవకలపై ఈ నెల 26వ తేదీన దిశ వెబ్సైట్లో "పరిహారం - పలహారం" అనే వార్త కథనం ప్రచురితమైంది. ఈ వార్త కథనానికి స్పందించిన జిల్లా వ్యవసాయ అధికారులు విచారణకు ఆదేశించారు.

విచారణ అధికారిగా వైరా ఏడిఏ కరుణశ్రీని నియమించారు. అయితే సోమవారం ఏడీఏ వైరా ఏవో తో కలిసి మండలంలోని కొండకుడిమ, విప్పలమడక గ్రామాల్లో విచారణ నిర్వహించారు. ముందుగా కొండకుడిమ గ్రామంలో అధికారులు విచారణను మమ అనిపించారు. పంట నష్టపోయి ప్రభుత్వం నుంచి నగదు మంజూరైన రైతుల జాబితా పేర్ల అనుగుణంగా అధికారులు విచారణ నిర్వహించలేదు. అదేవిధంగా అసలు ఆ గ్రామంలో పంట నష్టపోయి పరిహారం అందని రైతులు వివరాలను సేకరించలేదు. అనంతరం విప్పలమడక గ్రామంలోని రైతు వేదికలో విచారణ నిర్వహించిన అధికారులు ఇక్కడ పని చేసే ఏఈవో ను కాపాడే విధంగా రైతులను సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ చేసి తమ వైపు లొంగదీసుకున్నారు.

పంట నష్టపరిహారం లో అవకతవకలు జరిగింది వాస్తవమేనని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తాము చూసుకుంటామని ఏడిఏ, ఏవో రైతులకు స్పష్టం చేశారు. తాము ఈ ప్రాంతానికి కొత్తని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో దెబ్బతిన్న తమ పొలాలను పరిశీలించాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే దెబ్బతిన్న పంటలకు పంట నష్టపరిహారం రాని విషయం వాస్తవమేనని అధికారులు అంగీకరించారు. ఇప్పుడు దెబ్బతిని గండి పండిన పొలాలను తాము పరిశీలించిన ప్రయోజనం లేదని, ప్రస్తుతం ఎలాంటి నష్టపరిహారం ఇప్పించలేమని స్పష్టం చేశారు. తాము ఇప్పటి నుంచి రైతులకు అందుబాటులో ఉండి సేవలను అందిస్తామని వివరించారు. విచారణకు వచ్చిన అధికారులు తమ విచారణ నిర్వహించకుండా తప్పిదం చేసిన ఎఈఓ ను కాపాడేందుకు రైతులకు పూర్తిస్థాయిలో సర్ది చెప్పటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

విప్పలమడక గ్రామంలో రైతులకు అన్యాయం జరిగిన విషయం తమకు తెలుసన్న అధికారులు అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా వారిని వెనకేసుకొని రావటం పలు విమర్శలకు దారి తీస్తోంది. విచారణలో మీరు ఏది చెప్పినా రాసుకుంటామని, కానీ ఈ ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ ఏఈఓపై రైతులు ఫిర్యాదు చేయకుండా అధికారులు తమ మేధస్సును ఉపయోగించటం విశేషం. గ్రామంలో సుమారు 30 నుంచి 40 మంది రైతులు పంట వర్షానికి పూర్తిగా దెబ్బతింది. అలాంటి రైతుల పొలాలను పరిశీలించకుండా ఏఈఓ తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ రైతులకు నష్టపరిహారం అందలేదు. అయినప్పటికీ అధికారులు రైతులనే బుజ్జగించి అందుకు కారణమైన ఏఈఓ పై ఎలాంటి చర్యలు లేకుండా చూసుకోవడం విశేషం. మీరు విచారణలో ఏది చెప్పినా తాము కూడా బాధ్యులం అవుతామని, అందుకని ఒక్కసారి ఆలోచించాలని కోరడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed