భద్రాద్రి మూడు ముక్కలు కానట్టేనా ?

by Sridhar Babu |
భద్రాద్రి మూడు ముక్కలు కానట్టేనా ?
X

దిశ, భద్రాచలం : రాష్ట్ర విభజన కారణంగా ఇప్పటికే చాలా నష్టపోయిన భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో భద్రాద్రి వాసులు ఆందోళనకు గురయ్యారు. భద్రాద్రి అభివృద్ధికి ఆంధ్రలో విలీనం అయిన ఐదు పంచాయతీలను భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేస్తున్న సమయంలో... ఐదు పంచాయతీలను భద్రాద్రిలో కలపక పోగా, ఉన్న పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజించడం కారణంగా మరింత నష్టపోయే అవకాశం ఉందని భద్రాద్రి వాసులు భావిస్తున్నారు. వాస్తవానికి భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ గా అప్గ్రేడ్ చేయాలనే డిమాండ్ ఎప్పటినుండో ఉంది. భద్రాచలం పట్టణ జనాభా 60 వేలకు పైగా ఉండటంతో మున్సిపాలిటీగా మార్చేందుకు గత ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది.

అప్పటి గవర్నర్ తమిళ సై ఈ బిల్లును ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడంతో భద్రాచలం పట్టణాన్ని మూడు పంచాయతీలుగా విభజించేందుకు మరో బిల్లు ప్రవేశపెట్టారు. ప్రస్తుత గవర్నర్ పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపటంలో భాగంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు పంచాయతీల విభజన బిల్లుకు కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు పంచాయతీలుగా చేసే విభజన బిల్లు గవర్నర్ ఆమోదం తెలిపినా... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని లేదు.

ప్రస్తుతం ఉన్న భద్రాచలం మేజరు గ్రామ పంచాయతీని భద్రాచలం, శాంతినగర్, సీతారామనగర్ అనే మూడు పంచాయతీలుగా విభజన చేసే అంశాన్ని భద్రాద్రి వాసులు వ్యతిరేకస్తున్నారు. భద్రాద్రి అభివృద్ధి మరింత కుంటుపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భద్రాచలం పట్టణ వాసుల అభిప్రాయానికి జై కొడుతున్నట్లు తెలిసింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంచాయతీల విభజన బిల్లుకు సుముఖంగా లేనట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed