నిజం చెబితే మీ సంగతి చూస్తా.. ! ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ బెదిరింపులు

by Shiva |
నిజం చెబితే మీ సంగతి చూస్తా.. ! ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ బెదిరింపులు
X

దిశ, కొత్తగూడెం: ‘నిజం చెబితే మీ సంగతి చూస్తాం’ అంటూ విద్యార్థులకు కొత్తగూడెం ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ హుకూం జారీ చేసింది. ఇక్కడ వసతి గృహంలో ‘నీళ్లలో నలకలు, అన్నంలో పురుగులు’ అనే శీర్షికతో సోమవారం కథనం ‘దిశ’ దినపత్రిక ప్రచురితమైంది. హాస్టల్‌లో విద్యార్థినులు పడుతున్న అవస్థలపై కథనంలో వివరించింది. దీంతో కోపోద్రిక్తురాలైన హాస్టల్ వార్డెన్ విద్యార్థినులను బెదిరించడం మొదలుపెట్టింది. నీళ్లలో నలకలు వస్తే భరించాలి, అన్నంలో పురుగులు వస్తే ముక్కు మూసుకుని తినాలి, పప్పులో వెంట్రుకలు వస్తే వెంట్రుకలు పక్కకు పెట్టి పప్పును తినాలి, అంతేగానీ విషయం బయటికి చెప్పొద్దు, అనేలా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లేని పక్షంలో సామాన్లు సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వార్డెన్ తమతో అంటున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు.

విద్యార్థినులపైనే నెపం

హాస్టల్ వార్డెన్ విద్యార్థినులను బెదిరించి భయపెడుతున్నారనే అంశంపై మంగళవారం జిల్లా అభివృద్ధి శాఖ అధికారిణి డి.అనసూయ‌ను కార్యాలయంలో కలిసి వివరణ కోరగా.. ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. విద్యార్థినులే కావాలని అన్నంలో పురుగులు, పప్పులో వెంట్రుకలు వేశారని వింతగా సమాధానం చెప్పుకొచ్చారు. తమ డిపార్ట్‌మెంట్ ప్రతిష్టను దెబ్బతీయాలనే కొందరు కుట్ర పన్ని ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. భోజనంలో పురుగులు వచ్చినా.. కూరలో వెంట్రుకలు వచ్చిన సందర్భంలో తమ కార్యాలయానికి వచ్చి విద్యార్థినులు ఫిర్యాదు చేయవచ్చని, ఇలా పత్రికలకు సమాచారం ఇవ్వడం ఏంటని తిరిగి ప్రశ్నించారు.

ఒక్కొక్కరిగా విచారిస్తేనే..

ఈ అంశంపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. సోమవారం హాస్టల్‌కు చేరుకున్న ఇంటిలిజెన్స్ సిబ్బంది హాస్టల్లో జరుగుతోన్న అవకతవకలపై నివేదిక తయారు చేశారు. సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు హాస్టల్‌కు చేరుకుని ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. కాగా, పొరపాటును కప్పిపుచ్చి, పక్కదోవ పట్టించేందుకు ఎస్సీ వెల్ఫేర్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విచారణకు వచ్చే అధికారులు విద్యార్థినులను ఒక్కొక్కరిగా విచారిస్తేనే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు బాలికల వసతి గృహ హాస్టల్ వార్డెన్ తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రెండు హాస్టళ్లకు వసతి గృహాధికారిగా ఉండటం, అదనంగా మరో ఏడు హాస్టళ్లకు పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు రావడంతో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed