MPDO శ్రీనివాస్ రావు ఉంటే మేము ఉద్యోగాలు చేయం

by Mahesh |
MPDO శ్రీనివాస్ రావు ఉంటే మేము ఉద్యోగాలు చేయం
X

దిశ, మణుగూరు: అది ఒక ప్రభుత్వ కార్యాలయం. ఆ కార్యాలయానికి ఆయనే బాస్.. బాస్ అనే అహంకారంతో MPDO శ్రీనివాస్ రావు కింది స్థాయి ఉద్యోగులను అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నారని కార్యాలయ సూపర్డెంట్ శ్రీనివాస్ కుమార్, యూడీసీ వేణుమాధవ్, సిబ్బంది రాఘవులు చెబుతున్నారు. పరిధికి మించి అనవసర పనులు చేపించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అంతేగాక కార్యాలయం ఖర్చులు మొత్తం తమతోనే పెట్టిస్తున్నారని వాపోతున్నారు. కార్యాలయంలో పని చేయాలంటేనే ఎంతో అసహనం గా ఉందని చెబుతున్నారు. MPDOపై విసుగుచెంది ఆయన ఉంటే మేము ఉద్యోగాలు చేయలేమని తెగేసి చెబుతున్నారు. అవసరమైతే కార్యాలయం గడప ముందు ధర్నాకు కూర్చుంటామంటున్నారు. మండల ఎంపీడీఓగా శ్రీనివాస్ రావు బాధ్యతలు చేపట్టి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు. కానీ తోటి ఉద్ద్యోగులను మాత్రం అనేక రకాలుగా వేధిస్తున్నారని అంటున్నారు. సెలవులు పెట్టి ఒక్క రోజు దాటిన పది రోజులు జీతం కట్టు చేస్తున్నారని ఉద్యోగాలు ఆరోపిస్తున్నారు.

ప్రతి పనికి మా డబ్బులే.. ఎన్నాళ్లు ఖర్చు పెట్టాలి

ప్రతి ప్రోగ్రామ్(ప్రభుత్వ,ప్రైవేటు) పనులకు తమ డబ్బులతో పనులు చేపించుకుంటున్నారని తోటి ఉద్యోగులు వాపోతున్నారు. కార్యాలయానికి కావలసిన స్టేషనరీ కూడా తమ డబ్బులతోనే తేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కార్యాలయానికి ఎవరైనా గెస్ట్ వస్తే ఆ గెస్ట్ కి కూడా తమ డబ్బులతోనే ఖర్చు పెట్టిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. గత సంవత్సరంలో కూడా ఎన్నో డబ్బులు పెట్టమని ఇంత వరకు కూడా ఆ డబ్బులు రాలేదని కంటతడి పెడుతున్నారు. ప్రస్తుతం మళ్ళీ తమ డబ్బులతోనే కార్యాలయం పనులు చేపించుకుంటున్నారని ఉద్యోగులు నొక్కి చెబుతున్నారు. కార్యాలయానికి తమ డబ్బులే ఖర్చు పెట్టి బిల్లులు పెడుతుంటే ఇప్పుడు ఉన్న ఎంపీడీవో శ్రీనివాస్ రావు ఆ బిల్లులను రిజెక్ట్ చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఇదేంటని అడిగితే ఆ బిల్లులు తనకు సంబంధం లేదని ఎంపీడీఓ చెబుతున్నారని ఉద్యోగులు అంటున్నారు.మరి కార్యాలయానికి ఖర్చు పెట్టిన డబ్బులు తమకు ఎవరు ఇస్తారని ఉద్యోగులు ఎంపీడీఓను నిలదీశారు. మొత్తం లక్ష నుండి రెండు లక్షల వరకు తమకు రావాల్సి ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్ రావు టార్చర్ ఎక్కువైందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మా డబ్బులు మాకు ఇప్పించి, ఎంపీడీవో శ్రీనివాస్ రావు టార్చర్ నుంచి మమ్మల్ని కాపాడాలని తోటి ఉద్యోగులు జిల్లా కలెక్టర్‌ని వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed