మురికి కాల్వను నందనవనం గా చేసింది నేనే

by Sridhar Babu |   ( Updated:2023-11-09 15:22:22.0  )
మురికి కాల్వను నందనవనం గా చేసింది నేనే
X

దిశ, ఖమ్మం : ఖమ్మం నగరంలో త్రీ టౌన్ ప్రాంతంలోని ఒకప్పటి పంట కాల్వ అయిన గోళ్లపాడు ఛానల్ ను మురికి కూపంలా మార్చిన వాడికి ఓటు వేస్తారా... లేక ఆ గోళ్లపాడు ఛానల్ మురుగును శుభ్రం చేసి అభివృద్ది చేసి నందనవనంగా మార్చిన తనకు ఓటు వేస్తారా అని మంత్రి ,ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం సాయంత్రం నగరంలోని త్రీ టౌన్ లోని 28వ డివిజన్ కొప్పెర నర్సింహా రావు, ధాడాల రఘు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఖమ్మం నగరంలో దాదాపు 11 కిలోమీటర్ల మేర మురుగు పారుతున్న గోళ్లపాడు ఛానల్ అభివృద్ధి ఊరికనే జరగలేదని, సైకిల్ పై నిత్యం తిరుగుతూ రూ.100 కోట్ల నిధులు తెచ్చుకుని నిరంతర పర్యవేక్షణ చేయడం వల్లే బాగు పడింది అని అన్నారు. అధికారులకు సిబ్బందిని వెంట

పెట్టుకుని ఐదేళ్లు శ్రమ పడి కష్టం చేస్తే ఖమ్మం నేడు సుందరీకరణ అయింది అని, రాత్రికి రాత్రి జరిగింది కాదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ తీసుకురావడం ద్వారా నేడు దోమలు, పందులకు, ఇతర కీటకాల బెడద నుండి విముక్తి పొంది త్రీ టౌన్ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంత కష్టపడి రేయింబగలు శ్రమించి అభివృద్ది చేస్తే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వచ్చి ఇదంతా నేనే అభివృద్ది చేశానని చెప్తున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. నీళ్లు పారే కాల్వను మురికి కాల్వ గా మార్చింది తుమ్మల అన్నారు. సమావేశంలో నియోజకవర్గాల ఎన్నికల సమన్వయకర్త ఆర్జేసీ కృష్ణ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, టౌన్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మెంతుల శ్రీశైలం, యర్రా అప్పారావు, అమరగాని వెంకన్న, ధనాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed