ఖమ్మం అభివృద్ధిపై నాకు స్పష్టమైన విజన్ ఉంది: తాండ్ర వినోద్ రావు

by Disha Web Desk 12 |
ఖమ్మం అభివృద్ధిపై నాకు స్పష్టమైన విజన్ ఉంది: తాండ్ర వినోద్ రావు
X

దిశ బ్యూరో, ఖమ్మం: జిల్లా అభివృద్ధిపై తనకు స్పష్టమైన విజన్ ఉందని, అందుకు అనుగుణంగా ఓ డాక్యుమెంట్ తయారు చేశానని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు తెలిపారు. గత పాలకులు స్వలాభం కోసం రాజకీయాలు చేసి, ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని, అలాంటి వారికి ఈ సారి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ‘దిశ’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు వెల్లడించారు.

కేటీపీఎస్ పై తీవ్ర నిర్లక్ష్యం..

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పాల్వంచ కేటీపీఎస్ ప్రస్తుతం జవసత్వాలను కోల్పోయింది. యూనిట్లన్నీ తగ్గిపోయాయి. కోల్ లైన్ ఉండి, కిన్నెరసాని నీటి సౌకర్యం ఉండి, వాటర్ షార్టేజ్ లేకున్నా అనుకున్న మేర ఉత్పత్తి సాధ్యం కాకపోవడం నిర్లక్ష్యానికి ప్రధాన కారణం. అన్నీ ఉండి ఎక్కడో శని ఉన్నట్లు ప్లానింగ్ లేని కారణంగా ఈ యూనిట్లు పడావు పడే స్థితికి వస్తున్నాయి. రామాపూర్ కోల్ మైన్స్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. అక్కడ ఆ యూనిట్ ఏర్పాటు చేస్తే అనేక మందికి ఉపాధి కలుగుతుంది. అంతేకాకుండా కేటీపీఎస్ ను సైతం అదనపు యూనిట్లతో రన్ చేస్తే ఎలాంటి ఇబ్బందులుండవు. బొగ్గు ఉన్న కాడ మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా, వ్యయం, భారం తో కూడిన పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే ఇక్కడి సింగరేణి కార్యాలయాన్ని కూడా మూసేసే అవకాశం లేకపోలేదు.

ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచలో కంపెనీలు..

నేను ఎంపీగా గెలిస్తే నెలరోజుల్లోనే ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేయించేందుకు ప్లాన్ చేశా. ఇప్పటికే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడా. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డాటా సెంటర్ ఏర్పాటుచేయించి నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. ఇక్కడి యువతను ఏ నాయకుడూ, ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. ఐటీ ఇండస్ట్రీస్, అసెంబ్లింగ్ యూనిట్స్, డ్రోన్ అసెంబ్లీ యూనిట్స్, మినీ ఐటీ కంపెనీలు స్థాపిస్తే యువతను పూర్తిస్థాయిలో ఆదుకోవచ్చు. వేలకొద్ది ఇంజనీరింగ్ యువతీ, యువకులు, డిగ్రీ పూర్తయిన యువత ఉద్యోగాలు లేక ఆశగా ఎదురుచూస్తున్నారు.

గ్రామాలు బాగుపడాలంటే..

జిల్లాలోని గ్రామాలు పూర్తిస్థాయిలో బాగుపడాలంటే ఓ ప్రణాళిక అవసరం. ఎన్జీఓలు, గ్రామస్తులకు లింక్ ఏర్పాటు చేసి అభివృద్ధికి పాటు పడవచ్చు. కార్పొరేట్ సంస్థల ద్వారా ఫండ్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ విషయంలో నాకు పూర్తిస్థాయిలో అనుభవం ఉంది. కార్పొరేట్ సంస్థలకు ఎన్జీవోలకు లింక్ చేసి, ఎన్జీవోలకు గ్రామస్తులకు లింక్ చేస్తే గ్రామాల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యం అవుతుంది. అదేవిధంగా రైతుల విషయంలో కూడా క్లారిటీ ఉంది. సేంద్రియ వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేసే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కూడా వివిధ సంస్థల ద్వారా ఎన్జీఓలను లింక్ చేసి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. వివిధ సంస్థలే కాకుండా కార్పొరేట్ సంస్థలు సైతం ఫండింగ్ చేస్తున్నాయి. రైతులు బాగుపడాలంటే ఎఫ్ పీఓలుండాలి. వాటి నుంచి మార్కెట్ లింకేజీలు కూడా సులభతరం అవుతుంది. మధ్యవర్తుల ప్రమేయం, దళారుల బెడద ఉండదు. పండించిన ప్రతీది పారదర్శకంగా అమ్మకం చేయవచ్చు. ఈ విషయంలో నేను కూడా చాలా స్టడీ చేసి ఈ సిస్టమ్ ను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రణాళిక రచించా.

విద్యా, వైద్యం విషయంలో..

విద్యా, వైద్యం ప్రధానమైంది. ఈ రెండింటి విషయంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఓన్ చేసుకుని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, విద్యాసంస్థలకు కావాల్సిన మొత్తం ఎక్విప్ మెంట్ అంతా ఏర్పాటు చేస్తాయి. వాటిని రన్ చేసుకోవడం మాత్రమే మన వంతు. ఇలాంటి సిస్టమ్ కూడా అమల్లో ఉంది కానీ ఆ లింకప్ వ్యవస్థను ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరూ చేయలేదు. విద్య, వైద్యం, ఉపాధి, యువత విషయంలో దృష్టి పెడితే అనేక సౌకర్యాలను మనం కల్పించవచ్చు. అందుకోసం నేను గెలిచిన మొదటి రెండు సంవత్సరాలు వీటిపైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నా.

నలుగురం జనాల్లోనే ఉంటున్నాం..

నేను, నా సతీమణి వినీల రావు, నా ఇద్దరు కుమారులు వినీత్ రావు, వినయ్ రావు రోజుకు 14 గంటలు ప్రజలతోనే ఉంటున్నాం. ప్రజల మధ్య తిరుగుతున్నాం. మాతో పాటు పార్టీ వ్యవస్థ, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కూడా తిరుగుతున్నాయి. నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా ఏం చేశారు? ఏం చేయనున్నారు? రాబోయే కాలంలో ఏం చేస్తారు? అన్నదే కాకుండా నేను గెలిస్తే ఏం చేస్తా? నా విజన్ ఏంటి? అన్న మ్యానిఫెస్టోతో ప్రజల్లోకి వెళుతున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రజలే ఆలోచిస్తున్నారు. ఎవరు ఏంటన్నది అర్థమైంది. ఒక్కసారి బీజేపీ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడి సమస్యలు తెలియదు కదా.. నేను మూడు నెలల నుంచి ప్రతి మండలంలో పర్యటించా. ప్రజల మధ్యలో తిరిగి వాళ్ల సమస్యలు తెలుసుకున్నా. ఇతర పార్టీల నాయకులు ఎవ్వరూ ఈ పని చేయలేదు. ఇప్పుడే ఇట్లుంటే గెలిచిన తర్వాత ప్రజల ముఖం కూడా వారు చూడరు. డబ్బుతో గెలవాలి అని భావిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.

బీజేపీ బలమైన పార్టీ..

బీజేపీ బలమైన పార్టీ అని ప్రజల్లోకి ఇండికేషన్ వెళ్లింది. ఖమ్మంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తూ బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధం అవుతున్నారు. గెలుపు గుర్రం బీజేపీ అభ్యర్థి అని భావిస్తున్నారు. అందుకే ప్రజలు తనను ఆదరిస్తున్నారు. మాకున్న రిపోర్టు ప్రకారం ఖమ్మంలో ఈసారి కమల వికాసం గ్యారంటీ. త్వరలో పార్టీ అగ్రనేతలు ఖమ్మంలో ప్రచారం నిర్వహిస్తారు. కాకతీయ వంశ వారసుడు, బస్తర్ మహారాజు కమల చంద్ర భంజ్ దేవ్ నా కోసం ఖమ్మం వచ్చారు. ప్రచారంలో పాలుపంచుకునేందుకు రెండు, మూడు రోజులు ఇక్కడే ఉండనున్నారు.

Next Story