బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి

by Disha Web Desk 15 |
బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి
X

దిశ, తల్లాడ : ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఒక ఛాన్స్ ఇచ్చి జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆదివారం తల్లాడ మండలంలో స్థానిక రింగ్ రోడ్లో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఖమ్మం పార్లమెంట్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, 24 గంటలు సేవలందించే ఆసుపత్రి కానీ అందుబాటులో లేదన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదన్నారు. కాంగ్రెస్ ముగ్గురు మంత్రులు వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకోవడానికి పోటీ పడ్డారని అన్నారు. తాను కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతామని, 400 పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని, అందులో ఖమ్మం జిల్లా ఉండాలని కోరారు. తనని ఎంపీగా ఢిల్లీకి పంపించాలని, మీ సేవకుడిగా సేవలు చేయటానికి సైనికుడిలా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నాయకులు నంబూరు రామలింగేశ్వర రావు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇశ్నేపల్లి అశోక్, మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు, ఎంపీటీసీ తిరుమల దేవి, తెదేపా, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నుండి బీజేపీలోకి భారీ చేరికలు

దిశ, కారేపల్లి : కాంగ్రెస్‌ పార్టీలో చేరికలకు ఆ పార్టీ నేతలు ఆసక్తి చూపించకపోవటం, కార్యకర్తల నుండి వ్యతిరేకత ఎదురవుతుండటంతో బీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం కారేపల్లి మండలం నుండి తాజా ఎంపీటీసీతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. బీఆర్‌ఎస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు దారావత్‌ పాండ్యానాయక్‌, సర్పంచ్‌ సంఘం అధ్యక్షులు భూక్యా రంగరావు ల నాయకత్వంలో ఖమ్మంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి తాండ్ర వినోదరావు సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు.

బీజేపీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్‌లు అజ్మీర అరుణ, మాలోత్‌ రాంజీ, ఈసం అరుణ, ధర్మసోత్‌ మౌనిక, తేజావత్‌ మంగమ్మ, వాంకుడోత్‌ కృష్ణ, దారావత్‌ రాజు, మాజీ ఎంపీటీసీ వాంకుడోత్‌ కమల సుక్యా, బీఎస్‌పీ నాయకులు బానోత్‌ వెంకిట్యా లతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. వీరికి బీజేపీ ఎంపీ అభ్యర్ధి తాండ్రా వినోద్‌ రావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణరాధోడ్‌, తురక నారాయణ, కల్తి రాంప్రసాద్‌, దనసరి శ్రీను, భూక్యా సుజాత తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed