గడల vs వనమా.. రోజురోజుకు వేడెక్కుతున్న గూడెం రాజకీయం

by Mahesh |
గడల vs వనమా.. రోజురోజుకు వేడెక్కుతున్న గూడెం రాజకీయం
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన వనమా వెంకటేశ్వరరావు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వ్యక్తిగతంగా వనమా వెంకటేశ్వరరావుకు ఎటువంటి మైనస్లు లేకపోయినా తనయుడు రాఘవ తెచ్చే తంటాలకు రోజురోజుకూ క్యాడర్ బలహీన పడుతూ వస్తుంది. ఎంతో మంది ఆత్మహత్యలకు ప్రత్యక్ష పరోక్ష కారకుడైన వనమా రాఘవను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినా పార్టీ కార్యకలాపాలలో పాలుపంచుకోవడంతో 17 శాతం ఓటు బ్యాంకు సన్నగిల్లుతూ వస్తుంది. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నట్లు పార్టీ వర్గాలే చర్చలు జరపడం గమనార్హం..

పోటా పోటీ..

గడల శ్రీనివాసరావు స్థాపించిన జీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్‌తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ సేవతో సవాల్ విసురుతుంటే, మరోవైపు స్థానిక శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం ఇంత అభివృద్ధి చెందింది అంటే కేవలం వనమాతోనే సాధ్యమైంది అంటూ మాటల యుద్ధం మొదలుపెట్టారు. గడల చేస్తున్న అనేక కార్యక్రమాలకు అడ్డుపడుతూ గడల కార్యక్రమాలకు హాజరయ్యే చోటామోటా ప్రజా ప్రతినిధులను కార్యక్రమాలకు హాజరు కాకూడదు అంటూ వనమా రాఘవ బెదిరింపులకు పాల్పడుతున్నారని గడల ఆరోపిస్తున్నారు.

తాము సేవా కార్యక్రమాలు చేయకపోగా.. చేస్తున్న వారిపై అక్కసుతో అడ్డుపడుతున్నారని గడల ఆరోపిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా అంతర్యుద్ధంలా ఈ వ్యవహారం సాగుతున్నా ఆదివారం పాల్వంచ మండలం ఉలవనూరులో గడల వనమా పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇవే నా చివరి ఎన్నికలు అంటూ ప్రజలను మభ్యపెట్టి గెలిచిన వనమా మళ్లీ ప్రజాక్షేత్రంలో ఉంటానంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇకనైనా వనమా రిటైర్‌మెంట్ తీసుకోవాలని గడల శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు రాజకీయ దుమారాన్ని రేకెత్తుతున్నాయి.

వనమాకు సీటు కష్టమేనా..?

వ్యక్తిగతంగా వనమా వెంకటేశ్వరరావు కు నియోజకవర్గంలో ఎటువంటి మైనస్లు లేకపోయినా తనయుడు వనమా రాఘవేంద్రరావు వ్యవహరిస్తున్న తీరు నియోజకవర్గ ప్రజలకే కాక సొంత పార్టీ నేతలకు కూడా మింగుడు పడటం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతూ ఏక చక్రాధిపత్యం చేస్తున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

ముఖ్యమంత్రి ఆశీర్వాద బలంతో కొత్తగూడెంలో ఎంట్రీ ఇచ్చిన గడల శ్రీనివాసరావుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బి ఫాం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచే దిశగా గడల దూకుడు పెంచారు. ఒకవేళ బీ ఫామ్ వనవా వెంకటేశ్వరరావుకు ఇవ్వకుంటే వనమా రాజకీయ జీవితం ప్రశ్నార్థకం గా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ సాగే రాజకీయ చదరంగంలో నిలిచేదెవరో గెలిచేది ఎవరో వేసి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.

Advertisement

Next Story