సంక్రాంతి తర్వాత రైతు భరోసా

by Sridhar Babu |
సంక్రాంతి తర్వాత రైతు భరోసా
X

దిశ, కూసుమంచి : సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని సీఎం చెప్పారని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల, రైతుల రాజ్యమని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా జీళ్లచెరువులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మండలానికి చెందిన అర్హులైన 60 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంవత్సరం క్రితం ఇదే రోజు 10 సంవత్సరాల నిరంకుశ పాలనకు చమర గీతం పాడి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, గడిచిన పది సంవత్సరాల్లో మాయమాటలు నమ్మి రాజ్యం అప్పగిస్తే గత పాలకులు సంపద కొల్లగొట్టారన్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పు కింద ప్రతి సంవత్సరం 6,500 కోట్ల రూపాయలు కడుతుందని అన్నారు.

27 రోజుల్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని అన్నారు. యువతకు 53 వేల ఉద్యోగాలు ఇచ్చామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తున్నట్టు చెప్పారు. వరి వేస్తే ఉరి అని గత ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం రైతులకు 500 బోనస్ ఇచ్చిందని గుర్తు చేశారు. నాడు ధాన్యానికి తరుగు తీస్తే ఇప్పుడు ఒక్క కేజీ కూడా తీయలేదని చెప్పారు. రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని తెలిపారు. 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేయిస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెస్ చార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 66 లక్షల 77 ఎకరాల్లో వరి సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందన్నారు. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, గత ప్రభుత్వం 10 ఏళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఏ దళారికి రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 99 వేల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం వచ్చిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్ని కచ్చితంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed