నకిలీ డెత్ సర్టిఫికెట్ బాగోతం బట్టబయలు.. అధికారుల విచారణ షురూ

by Shiva |
నకిలీ డెత్ సర్టిఫికెట్ బాగోతం బట్టబయలు.. అధికారుల విచారణ షురూ
X

దిశ, వైరా: వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై నిఘా సంస్థల అధికారులు విచారణ చేపడుతున్నారు. టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు గురువారం నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై వివరాలు సేకరించారు. ‘దిశ’ వెబ్‌సైట్‌‌లో బుధవారం ‘వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం’, ‘దిశ‘ దిన పత్రికలో గురువారం ‘నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం‘ అనే వార్త కథనాలు ప్రచరితం అయ్యాయి. అయితే ఆ కథనాలకు స్పందించిన సీపీ సునీల్‌దత్, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులను విచారణకు ఆదేశించినట్లుగా తెలిసింది.

ఈ మేరకు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. పల్లిపాడు గ్రామానికి చెందిన గంధం నగేష్ పేరుపై ఇంటి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇద్దరు దళారులు నకిలీ డెత్ సర్టిఫికెట్‌ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పేరుతో సృష్టించారని సమాచారం. ఆ డెత్ సర్టిఫికెట్ ఆధారంగా అధికారులు ఇంటి రిజిస్ట్రేషన్ చేశారు. నగేష్‌కు ఇంటి రుణం ఇప్పించేందుకు వైరా మండలంలోని వల్లాపురం, రెబ్బవరం గ్రామానికి చెందిన ఇద్దరు దళారులు డబ్బులు తీసుకుని నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారని తెలిసింది. చదువు రాని నగేష్‌కు రుణం ఇప్పించేందుకు అన్ని రకాల సర్టిఫికేట్లను తామే తెస్తామని చెప్పి నకిలీ డెత్ సర్టిఫికెట్ల తయారీకి పాల్పడినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నగేష్ గ్రామమైన పల్లిపాడు‌లో విచారణ చేపట్టినట్లుగా తెలిసింది.

అదేవిధంగా నగేష్‌తో టాస్క్‌ఫోర్స్ అధికారులు మాట్లాడినట్లుగా సమాచారం. అంతే కాకుండా వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ డెత్ సర్టిఫికెట్లు ఆధారంగా ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన జిరాక్స్ కాపీలను ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు తీసుకున్నారు. అయితే, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లోని డెత్ సర్టిఫికెట్లు ఒరిజినలా.. డూప్లికేటా అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. నకలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో రిజిస్ట్రేషన్ కొరకు డాక్యుమెంట్లు తయారు చేసిన రైటర్‌తో పాటు, దళారుల ప్రమేయం ఉందా అనే అంశంపై నిఘా సంస్థల అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారు. నగేష్‌కు రూ.4 లక్షల ఇంటి రుణాన్ని ఇప్పించిన దళారులు అందు కోసం రూ.1.5 లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు తనను మోసం చేసిన దళారులపై నగేష్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లుగా సమాచారం.

Next Story

Most Viewed