Police Commissioner Sunil Dutt : మైనర్, ర్యాష్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి..

by Sumithra |
Police Commissioner Sunil Dutt : మైనర్, ర్యాష్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి..
X

దిశ, ఖమ్మం సిటీ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు క్షేత్రస్ధాయిలో దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల కాలంలో రాత్రివేళలో గణనీయంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ లా & ఆర్డర్ ప్రసాద్ రావు పర్యవేక్షణలో బుధవారం రాత్రి పోలీసులు ముమ్మరంగా డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి లారీ డ్రైవర్లు, బస్, కారు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీలలో మందుబాబులు కార్లు, ద్విచక్ర వాహనం నడుపుతూ పట్టుబడ్డ 55 మంది పై కేసులు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణం మద్యం తాగి వాహనాలు నడపడం కాగా.. మరొకటి మైనర్ల డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ అని అన్నారు. కొద్దిరోజులుగా విద్యార్థులు, మైనర్లు బైకులు, కార్లు నడుపుతూ వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ప్రతిరోజు వాహనాల తనిఖీలో చేస్తూ.. ర్యాష్, మైనర్ డ్రైవర్లను పట్టుకున్నట్లు తెలిపారు.

గతంలో మైనర్ డ్రైవింగ్ చేస్తు పోలీసు వారికి పట్టుబడితే జరిమానా వేసి, తల్లిదండ్రులకి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించడం జరిగిందని తెలిపారు. ఇక నుంచి డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల వాహనాలు సీజ్ చేసి, వారితో పాటు వారి తల్లిదండ్రులను న్యాయస్థానంలో హజరు పరచడం జరుగుతుందని తద్వారా న్యాయస్థానం శిక్ష / జరిమానా విధించే అవకాశం వుంటుందని అన్నారు. కాబట్టే ఇకనైనా రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను, వాహనాల యజమానులను సూచించారు. ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, పిల్లలను రోడ్డు ప్రమాదం ద్వారా దూరం చేసుకోవడం తల్లిదండ్రులకు తీరని లోటన్నారు. మైనర్ డ్రైవింగ్, రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు గురించి అన్ని పాఠశాలల్లో విద్యార్ధిని, విద్యార్థులకు రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తద్వార విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకాలపాలను అడ్డుకట్ట వేసేందుకు విజిబుల్ పోలీసింగ్ మరింత పకడ్బందిగా అమలు చేయాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed