వైరా బంగారం షాపుల్లో జీరో దందా.. భారీగా GST ఎగనామం

by Bhoopathi Nagaiah |
వైరా బంగారం షాపుల్లో జీరో దందా.. భారీగా GST ఎగనామం
X

దిశ, వైరా : వైరా పట్టణంలోని బంగారు షాపుల్లో జీరో దందా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఈ దుకాణాల్లో విక్రయించే బంగారు ఆభరణాలపై ప్రభుత్వాలకు చెల్లించే పన్నులకు ఎగనామం పెడుతున్నారు. బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వానికి 1.5% , రాష్ట్ర ప్రభుత్వానికి 1.5% జీఎస్టీ విధిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే వైరాలోని బంగారు దుకాణ వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా జీరో వ్యాపారం కొనసాగిస్తున్నారు. వైరాలో మొత్తం సుమారు 13 బంగారు దుకాణాలు ఉన్నాయి. అయితే వైరాలోని పాత బస్టాండ్‌లో ఉన్న ఒకటి రెండు దుకాణాల్లో బంగారు ఆభరణాల వ్యాపారం ఎక్కువగా కొనసాగుతుంది.

వైరాలోని బంగారు వ్యాపారులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, విజయవాడ నుంచి జీరోలో ముడి బంగారాన్ని, బంగారు ఆభరణాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ముందుగా బంగారం కొనుగోలుదారులు నచ్చిన డిజైన్ ఎంచుకున్న తర్వాత ఆ డిజైన్‌లో బంగారు ఆభరణాలను విజయవాడ, జగ్గయ్యపేటలో తయారు చేయిస్తున్నారు. అక్కడ నుంచి తీసుకువచ్చి జీరో దందాతో వైరాలో బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నారు. బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు కనీసం బిల్లు కూడా ఇవ్వరంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం తెల్ల కాగితంపై బంగారు ఆభరణాల విలువ, తరుగు, మజూరు తదితర వివరాలు రాసి కొనుగోలుదారులకు ఇస్తున్నారు. ఈ జీరో దందా వైరాలో రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పలు బంగారు దుకాణాలకు జీఎస్టీ నెంబర్ లేకపోవడం, టాక్స్ బిల్లు బుక్కులు లేకపోవడం విశేషం.

బంగారు ఆభరణాలు తయారీలో తరుగు మజూరు పేరుతో కూడా ఇష్టానుసారంగా కోతలు విధిస్తున్నారు. వైరాలోని పాత సెంటర్లో అనేక దశాబ్దాలుగా బంగారం కొనుగోలుదారులను ఆకట్టుకొని నిత్యం అత్యధిక వ్యాపారం చేసే దుకాణాల్లో కూడా జీఎస్టీ అమలు కావడం లేదు. జీరో దందాను అరికట్టాల్సిన అధికారులు బంగారు దుకాణదారుల మామూళ్లకు అలవాటు పడి కనీసం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి బంగారు దుకాణాల్లో జీరో దందాను అరికట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed