flood water : వరద పోటు.. కోతకు గురవుతున్న ముర్రేడు వాగు..

by Sumithra |
flood water : వరద పోటు.. కోతకు గురవుతున్న ముర్రేడు వాగు..
X

దిశ, కొత్తగూడెం రూరల్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఈ ప్రాంతంలో నివాసం ఉండే కుటుంబాలలో వణుకు మొదలవుతుంది.. అంతేకాకుండా ఏ అర్ధరాత్రి పిడుగులాంటి వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ టెన్షన్ తో గడపాల్సిన దుస్థితి నెలకొంటుంది. వానాకాలం ముగిసేదాకా ఆ కుటుంబాలలో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఈ సమస్యకు ఎప్పుడు పుల్ స్టాప్ పుల్ స్టాప్ పడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.

లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలో ఉన్న ముర్రేడు వాగుకు వరద తాకిడి అధికమైంది. ప్రతి ఏడాది వర్షాకాలం సీజన్లో ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. భారీ వర్షాల కారణంగా దిగువ నుండి వచ్చే నీరు ఈ ముర్రేడు వాగులో కలుస్తుంటుంది. దీంతో వరద నీరు పొంగి వాగు కోతకు గురవుతుంది. గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద తాకిడికి భూమి కోతకు గురై వాగుకు ఆనుకొని ఉన్న ఇండ్లు కొన్ని నేలమట్టమైన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇటీవల ముర్రేడు వాగు పొంగి భారీగా వరద రావడంతో దాని తాకిడికి ఈ వాగు పక్కనే ఉన్న శ్రీ దత్త సాయి మారుతి దాన్య మందిరానికి సంబంధించిన భక్తులు పూజించే దుని గోపురం కుప్పకూలింది.

అంతేకాకుండా సాయిబాబా దేవాలయ పక్కన ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి, భవాని ఆలయ బిల్లింగ్ స్లాబ్ స్వల్పంగా దెబ్బతినడం జరిగింది. ఇలా వరదలు వచ్చినప్పుడల్లా వాగుకు అనుకుని ఉన్న ఇండ్లతో పాటు దేవాలయాల సంబంధించిన ఆస్తులకు నష్టం జరగడంతో ఇటు అర్చకులు అటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వాగు పొంగి భారీ వరదతో పంట పొలాల సైతం కోతకు గురి కావడంతో వ్యవసాయ రైతులు కూలీలు కలవరపడుతున్నారు. ఈ సమస్య ప్రతి ఏడాది వెంటాడడంతో నివాస కుటుంబాలు రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వేడుకుంటున్నారు.

రివిటింగ్ వాల్ శంకుస్థాపనకే పరిమితం...

ప్రతి వర్షాకాలం సీజన్లో వణికిస్తున్న ముర్రేడు వాగు నుంచి ఎదురయ్యే సమస్యను పరిష్కరించాలని గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేయగా నిధులు మంజూరు చేసినట్లుగా అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సైడ్ రివిటింగ్ వాల్ నిర్మాణానికి 2023 అక్టోబర్ నెలలో రూ.3350.00 లక్షలతో ఎమ్మెల్యే వనమా హట్టహాసంగా శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి పునాది పనులు కానీ ఇతర అభివృద్ధి పనులు ముందుకు సాగక పోగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా ఉందని కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలి..

ఆందోళనకు గురి చేసి ముర్రేడు వాగుకు ఇరువైపులా రివిటింగ్ వాల్ నిర్మాణానికి గత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిధులు మంజూరు చేసినట్లుగా ప్రకటించారు కానీ ఇంతవరకు ఎలాంటి పనులు జరగలేదని లక్ష్మీదేవిపల్లి మండలం సిపిఎం నాయకులు కోబల్ అన్నారు. గత వర్షాలతో వరద తాకిడికి కొన్ని ఇండ్లు నేలమట్టం కావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సీజన్లో కూడా ముర్రేడు వాగు మరికొంత కోతకు గురి కావడం జరిగిందని ఈ సమస్య పరిష్కారం కావాలంటే తక్షణమే రివిటింగ్ వాల్ నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని సిపిఎం నాయకులు కోబల్ స్పష్టం చేశారు. సమస్యను దృష్టిలో పెట్టుకొని సైడ్ రివిటింగ్ వాల్ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని లేనిపక్షంలో పోరుబాట తప్పదని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed