ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై చర్యలేవి ?

by Sridhar Babu |
ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై చర్యలేవి ?
X

దిశ, వైరా : ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి రాజకీయ పార్టీ సమావేశానికి హాజరైన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. రాజకీయ పార్టీ సమావేశానికి ప్రధానోపాధ్యాయుడు వెళ్లారని ఇంటిలిజెన్సీతో పాటు విద్యాశాఖ నివేదికలు సమర్పించినా నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. వైరాలోని శ్రీనికేతన్ విద్యాలయంలో ఈనెల 5వ తేదీన నిర్వహించిన వైరా మండల బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశానికి వైరాలోని సీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగబత్తిని భాస్కరరావు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు ఆయన సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి పార్టీ జెండాల మధ్య ఆయన మీటింగ్ లో కూర్చున్నారు. ఈ విషయమై ఈనెల 5వ తేదీన దిశ వెబ్ సైట్ లో బీఆర్ఎస్ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు హల్ చల్ అనే వార్త కథనం ప్రచురితమైనది.

దీంతో స్పందించిన అధికారులు వెంటనే విచారణ నిర్వహించి ఉన్నతాధికాలకు నివేదిక సమర్పించారు. విద్యాశాఖ తో పాటు ఇంటిలిజెన్స్ అధికారులు కూడా ప్రధానోపాధ్యాయుడు, బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నట్లు నివేదిక సమర్పించినట్లు తెలిసింది. అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై నేటి వరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. తాను పాఠశాల అభివృద్ధికి నిధుల కోసం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను కలిసేందుకు సమావేశం వద్దకు వెళ్లానని ప్రధానోపాధ్యాయుడు ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన ప్రధానోపాధ్యాయుడికి ఎన్నికల కోడ్ నిబంధనలు తెలియవా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పాఠశాల చైర్మన్ తో పాటు పిల్లలు లేకుండా ప్రధానోపాధ్యాయుడు ఒక్కడే సమావేశం వద్దకు వెళ్లి గంటన్నర ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ జెండాల నడుమ కార్యకర్తలతో కలిసి

సమావేశం మొత్తం విని గంటన్నర సేపు అక్కడే గడిపిన ప్రధానోపాధ్యాయుడు పై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుక అడుగు వేయటం పట్ల బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధుల ఒత్తిడి ఉందని తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధులు ఆదేశించిన విధంగా ప్రధానోపాధ్యాయుడికి అనుకూలంగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా వారికి జీ హుజూరంటున్నారని విమర్శలు విన వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం భవిష్యత్తులో అధికారులకు ప్రతిబంధకంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధానోపాధ్యాయుడుపై చర్యలు తీసుకోకపోవడంపై జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖలో చర్చ జరుగుతుంది. భవిష్యత్తులో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటే ఈ వ్యవహారం అడ్డుగా వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధానోపాధ్యాయుడు పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed