కాంగ్రెస్‌లో చేరడంపై BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ

by Satheesh |
కాంగ్రెస్‌లో చేరడంపై BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత స్టేట్ పాలిటిక్స్‌లో కీలక పరిణామాలు చేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు రాకపోవడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. నేరుగా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ హై కమాండ్‌కు అంతు చిక్కకుండా వ్యూహాలు రచించి.. సైలెంట్‌గా టాస్క్ పూర్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత, కేసీఆర్‌కు నమ్మిన బంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు అపరేషన్ గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఎలాంటి అనుమానం రాకుండా, ఒక్క లీక్ లేకుండా పోచారం పార్టీ మార్పు ఎపిసోడ్‌ను కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానంలో టెన్షన్ మొదలైంది. నెక్ట్స్ పార్టీనే వీడేది ఎవరనేది సైతం గులాబీ అగ్రనేతలకు అంతుచిక్కడం లేదు. మరి కొందరు గులాబీ ఎమ్మెల్యేలు సైతం త్వరలోనే కారు దిగి కాంగ్రెస్ గూటికీ చేరుతారని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలోనే పార్టీ మార్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పల్లా.. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనను పార్టీ మారాలని ఒత్తిడి చేస్తోందని, కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారేందుకు ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తన కుటుంబంపై ఎన్నో అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు. కేసులు, అరెస్ట్‌లు, జైలుకు వెళ్లడం తమకు కొత్త కాదని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు జైలుకు వెళ్లామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్నడూ ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed