న్యూ ఇయర్‌లో టీ-కాంగ్రెస్‌కు కొత్త బాస్.. రేసులో ముగ్గురు సీనియర్లు!!

by GSrikanth |   ( Updated:2022-12-30 02:48:10.0  )
న్యూ ఇయర్‌లో టీ-కాంగ్రెస్‌కు కొత్త బాస్.. రేసులో ముగ్గురు సీనియర్లు!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను ఈ పదవి నుంచి తొలిగించేందుకు ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్లతో పాటుగా పార్టీ మారిన నేతలు ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీలో నెలకొన్ని సంక్షోభాన్ని తొలిగించేందుకు రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్​సింగ్ ఎదుట సీనియర్లు మొత్తం రేవంత్, ఠాగూర్‌పై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఠాగూర్‌ను మార్చేందుకు ఏఐసీసీ సిద్ధమైనట్లు సమాచారం. అయితే, ఈ బాధ్యతలను ముందుగా దిగ్విజయ్‌కు అప్పగించాలని భావించినా.. ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ముగ్గురు సీనియర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

వరుస ఫిర్యాదులతో అసంతృప్తి

టీపీసీసీ కమిటీల విషయంలో చెలరేగిన వివాదాలు ఇంకా సమిసిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ఠాగూర్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా నియామకమైనప్పటి నుంచి రేవంత్​రెడ్డికి అండగా ఉంటూ, ఆయన నిర్ణయాలను సమర్థిస్తూ చేస్తున్న కీలక పనులు విఫలమైనట్లుగా ఏఐసీసీకి సీనియర్లు ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికలతో పాటుగా కీలక సమయాల్లో ఠాగూర్​కీ రోల్ పోషించలేదని, దీంతో పార్టీలో విభేదాలకు ఆయన కూడా కారణమయ్యాడనే విమర్శలున్నాయి. దీనికితోడుగా కాంగ్రెస్‌ను వీడిన నేతలు కూడా ఆయనపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకుంటారని, పార్టీ నాశనమయ్యేందుకు ఆయనే కారణమంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఏఐసీసీ కొంత సీరియస్​అయినట్లు సమాచారం.

ఎన్నికలకు ముందే ప్లాన్​

ప్రస్తుతం సీనియర్లంతా సేవ్​కాంగ్రెస్​పేరుతో తిరుగుబాటు చేస్తున్నారు. దిగ్విజయ్​సింగ్​వచ్చి సమన్వయం చేసే ప్రయత్నాలు చేసినా ఇంకా సద్దుమణగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏఐసీసీకి కీలక నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిలో ఠాగూర్‌ను రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించాలని సూచించినట్లు సీనియర్ల బృందం కొంత ఆశల్లో ఉంటోంది. దీంతో డిగ్గీ రాజా ఇచ్చే నివేదికతో రాష్ట్ర కాంగ్రెస్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయని కొంతమేరకు స్పష్టమవుతోంది. ప్రస్తుతం సీనియర్ల తిరుగుబాటు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్​రేవంత్‌ను మార్చేందుకు ఏఐసీసీ ఆసక్తి చూపించడం లేదని చెప్తున్నారు. కానీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను తప్పిస్తారని నేతలు భావిస్తునారు. పార్టీ బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవడం లేదని, రాష్ట్ర నేతల మధ్య కనీసం సమన్వయం కుదర్చడంలో ఠాగూర్ విఫలమయ్యారని దిగ్విజయ్​సైతం గుర్తించారు. దీనికి తోడుగా పార్టీని వీడిన వారితో పాటుగా సీనియర్లు సైతం ఠాగూర్‌పై విమర్శలు పెంచుతున్నారు. సీనియర్లను పట్టించుకోవడం లేదని, ఎలాంటి అంశాల్లోనూ సీనియర్​నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వరని, ప్రతి విషయంలో రేవంత్‌కు అండగా ఉంటున్నారని, ఈ పరిణామాలు పార్టీకి ఇబ్బందిగా మారినట్లు దిగ్విజయ్​ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం.

పరిశీలనలో ముగ్గురి పేర్లు

రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్కం ఠాగూర్‌ను తప్పించిన ఏఐసీసీ సీనియర్​నేతకు బాధ్యతలను అప్పగించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఢిల్లీలో చర్చ జరుగుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఏఐసీసీలోని సీనియర్​నేత, రాష్ట్రానికి చెందిన సీనియర్లను సముదాయించే నేతకు బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిశీలనలో ముగ్గురి పేర్లు ఉన్నాయని, హర్యానాకు చెందిన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సుర్జేవాలా, మరో సీనియర్ నేత, ఎంపీ పన్నాలాల్ పునియాతో పాటుగా మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్​పేర్లు కూడా విన్పిస్తున్నాయి. సుర్జేవాలా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి ఇంచార్జిగా ఉండటంతో.. తెలంగాణకు కూడా ఆయన్ను పంపించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇక, పునియా యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారిగా రిటైర్ అయి, కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆయన 2018లో చత్తీస్ గఢ్ ఎన్నికల సమయంలో ఇంచార్జిగా పనిచేశారు. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని పార్టీ భావిస్తోంది. దీంతో ఆయన పేరు కూడా తుది పరిశీలనలో ఉంది. ఇక, పక్కనే ఉన్న మహారాష్ట్రకు చెందిన నేత, మాజీ సీఎం పృథ్వీరాజ్​చౌహాన్‌కు కూడా ఇక్కడి రాజకీయాలపై అవగాహన ఉందని పార్టీ అంచనా వేస్తోంది. వీరిలో ఒకరిని ఏఐసీసీ తరుపున రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా పంపించనున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది.

Also Read...

రూ.2507 కోట్లు ఏమయ్యాయి.. హరితహారం కోసం వాడింది తక్కువే!!

Advertisement

Next Story