సోనియా గాంధీ చేసిన మిస్టేక్ రిపీట్ చేసిన కేసీఆర్.. చరిత్రలో కేటీఆర్ పేరు మిస్..?

by Satheesh |   ( Updated:2023-12-13 08:43:52.0  )
సోనియా గాంధీ చేసిన మిస్టేక్ రిపీట్ చేసిన కేసీఆర్.. చరిత్రలో కేటీఆర్ పేరు మిస్..?
X

దిశ, డైనమిక్ బ్యూరో/సిరిసిల్ల: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందగా కాలం కలిసి వచ్చినప్పుడే పదవులు దక్కించుకోవాలనే మాట రాజకీయాల్లో అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఈ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా మళ్లీ అవకాశాన్ని దక్కించుకోవడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇలానే ఉందనే టాక్ వినిపిస్తోంది. రెండు దఫాలుగా గులాబీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన కేసీఆర్ తన వారసుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టడంలో విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది.

కాస్త ధైర్యం చేసి కేటీఆర్‌కు ఆ పోస్టును అప్పగించి ఉంటే తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా కేటీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయేదనే కానీ ఆ ఛాన్స్ కేసీఆర్ చేతులార దూరం చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో వారసుడిని అధికార పీఠంపై కూర్చొబెట్టడంలో గతంలో సోనియా గాంధీ గతంలో చేసిన మిస్టేకే ఇప్పుడు కేసీఆర్ చేశారా? అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

నాడు రాహుల్.. నేడు కేటీఆర్:

2004లో కేంద్రంలో బీజేపీ మహాకూటమి నుంచి అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఈ క్రమంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రధానమంత్రి బాధ్యతలను తన కుమారుడు రాహుల్ గాంధీకి కాకుండా మన్మోహన్ సింగ్‌కు అప్పగించారు. తిరిగి 2009లో రెండోసారి అధికారంలోకి రాగా ఈసారి పీఎం పోస్ట్ రాహుల్ గాంధీని వరిస్తుందని అందరూ భావించినప్పటికీ సోనియా గాంధీ మాత్రం ఆ ఛాన్స్ మళ్లీ మన్మోహన్ సింగ్‌కే కల్పించారు. అనంతరం 2014లో హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని కాంగ్రెస్ నేతలు భావించినా 2014, 2018 కాంగ్రెస్ ఓటమిపాలైంది.

దీంతో 2009లో రాహుల్ గాంధీకి సోనియా గాంధీ ప్రధాని పదవి ఇవ్వకుండా పొరపాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ విషయంలోనూ కేసీఆర్ సైతం ఇదే పొరపాటు చేశారనే మాట వినిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బోణీ కొట్టింది. ఉద్యమ సమయంలో దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత తానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. అనంతరం 2018లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందగా మళ్లీ తానే సీఎంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను సీఎం చేయాలనే డిమాండ్లు వినిపించినా కేసీఆర్ మాత్రం సీఎం పదవిని వదులుకోలేదు. ఈ క్రమంలో మూడోసారి హ్యాట్రిక్ విజయంతో కేటీఆర్‌ను సీఎంగా చూడబోతున్నామని గంపెడాశలు పెట్టుకున్న గులాబీ శ్రేణులపై కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లింది. దీంతో నాడు రాహుల్ గాంధీకి అధికారం దూరమైనట్లే కేటీఆర్‌కు సీఎం పోస్ట్ దూరం అయిందనే చర్చ జరుగుతోంది.

తన వారసుడికి ఆ పేరు లేకుండా చేసిన కేసీఆర్:

రెండో దఫా అధికారంలోకి వచ్చాక పలు సందర్భాల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే లీకులు వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో బహిరంగంగా కామెంట్లు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్ తన వద్దకు వచ్చారని స్వయంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. అయితే సీఎంగా తాను తప్పుకుని కేటీఆర్‌ను గద్దెనెక్కిస్తే పార్టీలోని సీనియర్లు, మంత్రులు, ఇంటిపోరుతో విచ్ఛిన్నమై పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని ఆలోచించిన కేసీఆర్ ఆ ప్రయత్నం మానుకునట్లు గతంలో చర్చ జరిగింది.

ఈ క్రమంలో వ్యూహాత్మకంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్.. 2023లో మరోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామనే ధీమాతో లెక్కలు వేసుకున్నారని.. ఈసారి గెలిచిన తరువాత ఒక సంవత్సరం పాటు తాను సీఎంగా కొనసాగి, అనంతరం తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తూ తన వారుసుడు కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు అప్పగించాలని చూశారనే టాక్ వినిపించింది. కానీ ప్రజాతీర్పులో కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది.

ఒకవేళ కేసీఆర్ ముందే తెగించి కేటీఆర్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తే తెలంగాణకు రెండవ సీఎంగా కేటీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోయేదని, ఇదే సమయంలో కేటీఆర్ నిర్ణయాలతో 2023 ఫలితాలు మరోలా ఉండేవేమో అనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే కేటీఆర్ సీఎం కాకపోయినా అన్ని శాఖలు తన ఆధీనంలో పెట్టుకొని షాడో సీఎం లాగా అధికారాన్ని అనుభవించాడని పార్టీ శ్రేణులు సరిపెట్టుకుంటున్నారు. మరి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పనున్నది.

Advertisement

Next Story

Most Viewed