KCR: ఎన్నికల కదనరంగంలోకి కేసీఆర్.. రేపటి నుంచి బస్సు యాత్ర ప్రారంభం

by Disha Web Desk 1 |
KCR: ఎన్నికల కదనరంగంలోకి కేసీఆర్.. రేపటి నుంచి బస్సు యాత్ర ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్డు షోలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మధ్యాహ్నం1.30 గంటల నుంచి 2 గంటల మధ్య తెలంగాణ భవన్‌లో ‘ప్రగతిరధం’ బస్సుకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అంతకు ముందు భవన్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయనున్నారు. ఇప్పటికే రోడ్డు షో‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భవన్‌కు కార్యకర్తలు, నాయకులు తరలిరానున్న నేపథ్యంలో 400 మందికి పైగా భోజన ఏర్పాట్లను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు సైతం తెలంగాణ భవన్‌కు వచ్చి కేసీఆర్ వెంటే వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ నుంచి బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్ మీదుగా మిర్యాలగూడకు చేరుకోనున్నారు. కేసీఆర్ బస్సుతో పాటు భవన్ నుంచి సుమారు 50కిపైగా వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లనున్నట్లు భవన్ వర్గాలు తెలిపాయి.

కేసీఆర్ వెంట రాష్ట్ర కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా వెంట రోడ్డు షోలలో పాల్గొనబోతున్నారు. పంతంగి టోల్ గేట్ వద్దకు కేసీఆర్ చేరుకోగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతలు భారీ కాన్వాయితో స్వాగతం పలుకనుంది. సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడలో రోడ్డు షో ప్రారంభం కానుంది. అనంతరం సూర్యాపేటకు చేరుకొని అక్కడ రోడ్డు షో నిర్వహించి అక్కడే కేసీఆర్ బస చేయనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో బుధవారం రాత్రి భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రోడ్డు షోలో మే 10వరకు కొనసాగనున్నాయి. మంగళవారం శుభదినం కావడంతో ప్రగతిరథం బస్సుకు తెలంగాణ భవన్‌లో బ్రాహ్మణులు పూజలు నిర్వహించి గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు.



Next Story

Most Viewed