ఆంధ్రావాళ్లు నీళ్లు ఎత్తుకెళ్తుంటే మినిస్టర్ ఏంచేస్తుండు.. ఉత్తమ్‌పై KCR ఫైర్

by Rajesh |
ఆంధ్రావాళ్లు నీళ్లు ఎత్తుకెళ్తుంటే మినిస్టర్ ఏంచేస్తుండు.. ఉత్తమ్‌పై KCR ఫైర్
X

దిశ, సూర్యాపేట : తెలంగాణలో రైతులకు వరంగా ఉన్న శ్రీరాంసాగర్, కాళేశ్వరం, మేడిగడ్డ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఏదో సాకు పేరుతో 60 నుండి 70 టిఎంసిల నీరు వృథాగా వదిలేయడంతో పాటు రైతుల పంట పొలాలకు నీరు అందించలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆయన బుదవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్, చింతలపాలెం ప్రాజెక్టుల్లో నుండి ఆంధ్రవాళ్ళు అక్రమంగా నీరు ఎత్తుకెళ్తుంటే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి చేతకాని దద్దమ్మలా కూర్చోవడం ఏమిటని విమర్శించారు. అంతే కాకుండా టెయిల్ పాండ్ నుండి కూడా 5 టిఎంసిల నీరు దోచుకు పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేస్తుందని ధ్వజమెత్తారు.

సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజక వర్గాల రైతులకు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగు నీరు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. గత కొన్నేళ్లుగా మూసీ మురికి నీరు తాగలేక తీవ్ర ఇబ్బందులు పడ్డ సూర్యాపేట జనానికి గడిచిన 10 ఏళ్ల పాటు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు అందించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, మిషన్ భగీరథలను నాశనం చేశారని ఆరోపించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రేగులు తీసి మెడకు వేసుకుంటానని, గుడ్లు పీకి గోళీలు ఆడుతానని సీఎం రేవంత్ రెడ్డి అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎటువంటి కారణం లేకుండా కేసీఆర్‌ని జైల్లో పెడతానని సీఎం అనడం కక్ష సాధింపు చర్యే అన్నారు. అయినా కేసీఆర్ జైలుకి వెళ్ళడం కొత్త కాదని వెల్లడించారు. ఈ రోడ్డు షోలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసన సభ్యులు గాదారి కిషోర్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story