‘ఇంకెప్పుడు మారుతావు కేసీఆర్’ రిజల్ట్స్ విషయంలో గులాబీ బాస్ మౌనంపై నెటిజన్ల సెటైర్లు

by Prasad Jukanti |
‘ఇంకెప్పుడు మారుతావు కేసీఆర్’  రిజల్ట్స్ విషయంలో గులాబీ బాస్ మౌనంపై నెటిజన్ల సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగితే తిరిగి ప్రజామోదం ఖాయం అని నిరూపించే సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తనకు అలాంటి రూల్స్ ఏమి లేవు అనేలా వ్యవహరిస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చావుదెబ్బ తిన్నది. పార్టీ చరిత్రలో తొలిసారి లోక్ సభలో గులాబీ పార్టీ సింగిల్ సీటు కూడా సాధించలేకపోయింది. అయితే ఓటమిపై కేసీఆర్ స్పందించకపోవడంపై నెటిజన్లు కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఓటమిపై స్పందించకుండా నేరుగా ఫామ్ హౌస్ వెళ్లిపోయారనే విమర్శలు వినిపించాయి. పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ప్రజాతీర్పుకు ఇచ్చే గౌరవం ఇదేనా అనే టాక్ వినిపించింది. కానీ కేసీఆర్ మాత్రం చాలా రోజుల తర్వాత ఓటమిపై స్పందించారు.

తాజాగా ఎంపీ ఎన్నికల్లో పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. అయితే పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షించి పార్టీ శ్రేణులు పని చేశాయి. అలాంటి వారందరికీ ధైర్యం చెప్పేందుకు కేసీఆర్ కనీసం మీడియా ముందుకు రాకపోవడం ఏంటనే చర్చ జరుగుతోంది. అయితే ఏపీలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న చంద్రబాబు, పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా ప్రకటన విడుదల చేసిన కేసీఆర్ తెలంగాణ ఫలితాలపై మాత్రం రియాక్ట్ కాలేదు. అదే ఏపీలో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ అధినేత జగన్ మాత్రం మీడియా ముందుకు వచ్చి ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. దీంతో కేసీఆర్ ఇంకెప్పుడు మారుతారో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed