KCR: ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు చేస్తున్న కేసీఆర్ దంపతులు

by Ramesh N |   ( Updated:2024-09-06 07:37:34.0  )
KCR: ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక పూజలు చేస్తున్న కేసీఆర్ దంపతులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలపై గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తర్వలోనే కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నట్లు పలు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా కేసీఆర్ దంపతులు మహాయాగం చేస్తున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేద పండితుల సమక్షంలో కేసీఆర్ దంపతులు ‘నవగ్రహ యాగం’ చేస్తున్నారు.

మాజీ సీఎం కేసీఆర్ దైవ భక్తి గురించి అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఆయన ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యేక పూజలు, యాగాలు చేస్తుంటారు. గతంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని 2015‌లో కేసీఆర్ చండీయాగం చేశారు. 2018లో ఎన్నికలకు వెళ్లే ముందు తనకు చెందిన ఎర్రవెళ్లి ఫామ్‌హౌస్‌లో రాజశ్యామల యాగం చేశారు. అలాగే.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 1 నుంచి మూడు రోజులపాటు రాజశ్యామల యాగం అని చేశారు.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం, కీలక నేతలు పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. దీంతో ప్రతికూల రాజకీయ వాతావరణం, పలు ఇబ్బందుల కారణంగా వేద పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఐదు నెలల పాటు తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్‌పై విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి కేసీఆర్ వద్ద కవిత ఉంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవిత భవిష్యత్, శ్రేయస్సు కోసం వేద పండితుల సూచన మేరకు తాజాగా యాగం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. కేసీఆర్ దంపతులు చేపట్టిన ‘నవగ్రహ యాగం’ యాగంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నట్లు సమాచారం.

‘నవగ్రహ యాగం’ తర్వాత కేసీఆర్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం, రాష్ట్రంలో రైతుల సమస్యలు, రాష్ట్ర ప్రజల స్థితిగతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం అయిందని కేసీఆర్ గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల సమక్షంలో నిలదీసేందుకు కేసీఆర్ బయటకు వస్తున్నారట. వినాయక చవితి తర్వాత కేసీఆర్ బస్సు యాత్రలు ఊరూరా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. వినాయక చవితి రోజున ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతుందని గులాబీ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story