- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతా గోప్యం.. అయినా విక్టరీ! కల్వకుంట్ల ఫ్యామిలీలో ఫస్ట్ వికెట్?
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ఆమె నివాసంలో ఏడున్నర గంటలపాటు విచారించారు. సీబీఐ డీఐజీ పర్యవేక్షణలో ఆరుగురు అధికారుల బృందం షెడ్యూలుకంటే పది నిమిషాల ముందే కవిత నివాసానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలు మొదలైన విచారణ సాయంత్రం ఆరున్నర వరకూ కొనసాగింది. లిక్కర్ స్కామ్‌తో ఉన్న సంబంధాలపై అనుమానాలను నివృత్తి చేసుకోడానికి సీఆర్‌పీసీలోని సెక్షన్ 160 ప్రకారం ఆమెను ప్రశ్నించి చివరకు న్యాయవాది సమక్షంలో రికార్డెడ్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. విచారణ ముగిసిన వెంటనే ఆమె నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని కారులో ప్రగతి భవన్ వెళ్ళారు. సీబీఐ అధికారుల విచారణ తీరును కేసీఆర్‌కు వివరించారు. దాదాపు ముప్పావుగంట పాటు అక్కడే ఉన్న కవిత రాత్రికి ఆమె నివాసానికి చేరుకున్నారు.
సీబీఐ అధికారులు ఏమేం ప్రశ్నలు వేశారు, దానికి ఎలాంటి సమాధానం ఇచ్చాననే వివరాలను తొలుత మీడియా సమావేశంలోనే వెల్లడించాలనుకున్నప్పటికీ లీగల్ నిపుణులతో మాట్లాడిన తర్వాత దాన్ని రద్దు చేసుకున్నారు. పత్రికా ప్రకటనను మాత్రమే విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. ప్రగతి భవన్ వెళ్ళి తండ్రి కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత ఆ ప్రకటనను కూడా ఇవ్వలేనంటూ వివరణ ఇచ్చారు. ఏడున్నర గంటల పాటు విచారణ ఎలా జరిగిందీ తండ్రికి వివరించిన కవిత ఆ వివరాలను మాత్రం బైటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. సీబీఐ అధికారుల విచారణ జరుగుతున్నంతసేపూ కొద్ది దూరంలో రోడ్డుమీదనే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉత్కంఠను అనుభవించారు. విచారణ ఎప్పటికి ముగుస్తుందోననే టెన్షన్‌లో ఉండిపోయారు.
విచారణ ముగించుకుని సీబీఐ అధికారులు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, శ్రేణులు నివాసంలోకి వెళ్ళి పలుకరించారు. గంట సేపటి తర్వాత బైటకు వచ్చిన ఆమె బైట ఎదురుచూస్తున్న కేడర్‌కు విక్టరీ సింబల్ తరహాలో అభివాదం చేశారు. సంతోషంగా విష్ చేయడంతో సీబీఐ అధికారుల ప్రశ్నలన్నింటినీ ధైర్యం, విజయవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. "ప్రస్తుతానికి సీఆర్‌పీసీ 160 కింద ఇచ్చిన నోటీసు ప్రకారం వివరణ తీసుకునే ప్రక్రియ ముగిసింది. ఇప్పటికి అవసరమైన వివరాలు తీసుకున్నాం.. అవసరమైతే భవిష్యత్తులో మరోసారి నోటీసు ఇస్తాం.. వివరణ తీసుకుంటాం.." అని సీబీఐ అధికారులు చెప్పినట్లు కవిత సన్నిహితులు మీడియాకు వివరించారు.
'ప్రస్తుతానికి'.. 'ఇప్పటికైతే' అనే పదాల ప్రస్తావన రావడంతో మరోసారి కూడా విచారణకు పిలుస్తారేమోననే సందేహాలు గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నది. దాదాపు ఏడాది కాలం పాటు ఇలాంటి కక్షసాధింపు చర్యలు, బెదిరింపులు ఉంటాయని, అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇలా వేధిస్తూనే ఉంటారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో వ్యాఖ్యానించడంతో ఇకపైన కూడా సీబీఐ, ఈడీల విచారణలు కొనసాగుతాయన్న సందేహాన్ని వ్యక్తం చేసినట్లయింది. ఢిల్లీలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారించిన తర్వాత బైటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీలో చేరాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చారని, బెదిరించారని వ్యాఖ్యానించారు. దీనికి సీబీఐ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు కవిత అలాంటి అవకాశానికి తావు ఇవ్వకుండా మీడియాకు దూరంగా ఉన్నారు.
లిక్కర్ స్కామ్‌లో అవినీతి, అవకతవకలు, నేరారోపణలకు సంబంధించిన అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోడానికి సీబీఐ అధికారులు ఆమెకు ఈ నెల 2న నోటీసులు జారీచేశారు. ఆమె సూచించిన చోటనే 6న విచారించనున్నట్లు సమాచారమిచ్చారు. హోంశాఖ డైరెక్టర్ ఫిర్యాదు కాపీ, సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రతి కావాలంటూ సీబీఐకి లేఖ రాయడం, అవి అందుకుతున్న తర్వాత వాటిలో తన పేరు లేదని పేర్కొని 11-15 తేదీల మధ్యలో (13 మినహాయించి) ఎప్పుడైనా విచారణకు రావచ్చని రిప్లై ఇచ్చారు. ఆ ప్రకారం ఉదయం 11.00 గంటలకు పదినిమిషాల ముందే రెండు కార్లలో సీబీఐ అధికారులు బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఏమేం ప్రశ్నలు వేశారు, వాటికి కవిత ఎలాంటి జవాబు చెప్పారు.. తదితరాలేవీ అటు కవితగానీ, ఇటు సీబీఐ అధికారులుగానీ వివరించలేదు.
లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయానికి సంబంధించి ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల్లో పలువురి నుంచి సీబీఐ వివరాలను సేకరించింది. అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని అంశాలను నివృత్తి చేసుకోవాలనుకుంది. 'సౌత్ గ్రూపు' పేరుతో ఎమ్మెల్సీ కవితతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, అరబిందో ఫార్మా ఫుల్‌టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ పాలసీ రూపకల్పన సమయంలో జోక్యం చేసుకున్నారని, విజయ్ నాయర్ (ఓన్లీ మచ్ లౌడర్ ఎంటర్‌టైన్‌మెంట్ మాజీ సీఈఓ) ద్వారా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపుల రూపంలో ముట్టచెప్పారని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నది. రాధా ఇండస్ట్రీస్ అధినేత దినేష్ అరోరా బ్యాంకు అకౌంట్ నుంచి కూడా బదిలీ అయినట్లు అందులో పేర్కొన్నది.
విజయ్ నాయర్, శరత్‌చంద్రారెడ్డి, బోయిన్‌పల్లి అభిషేక్, కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు తదితరులను విచారించిన సీబీఐ వారి నుంచి రాబట్టి సమాచారంలోని అంశాలపై కవిత నుంచి వివరణ తీసుకోవాలని భావించి ఈ నోటీసులను జారీచేసింది. విచారణ సందర్భంగా ఆమె నుంచి లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన వివరాలన్నింటినీ ఏడున్నర గంటల పాటు ప్రశ్నించి రాబట్టింది. సీబీఐ అధికారులు రావడానికి ముందే కవితకు న్యాయపరమైన సలహాలు ఇవ్వడానికి సీనియర్ అడ్వొకేట్ సారంగపాణి ఆమె నివాసానికి (స్టేట్ ప్రోటోకాల్ వాహనంలో) చేరుకున్నారు. సీబీఐ అధికారులు ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టిన తర్వాత వీడియో రికార్డింగ్ రూపంలో ఆమె నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేసుకున్నారు. అధికారుల వెంట స్టెనోగ్రాఫర్ కూడా ఉన్నట్లు తెలిసింది.
Read more:
TRS MLC Kalvakuntla Kavitha :కవితకు నోటీసులు.. అసలేంటి CRPC 91?