ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి రాజీనామా..! కొనసాగనున్న కూచుకుళ్ల!!

by Nagaya |
ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి రాజీనామా..! కొనసాగనున్న కూచుకుళ్ల!!
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన కసిరెడ్డి నారాయణరెడ్డి శుక్రవారం తన పదవికి రాజీనామా చేయగా, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి యథావిధిగా కొనసాగనున్నారు. రెండవసారి ఎమ్మెల్సీలుగా ఎంపికైన దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలు, తమ రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా బీఆర్ఎస్‌కు దూరం అయిన విషయం పాఠకులకు విదితమే. కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కించుకోవడం ఎన్నికలలో విజయం సాధించడం చకచక జరిగిపోయాయి. ఈ మేరకు కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన శుక్రవారం శాసనమండలి చైర్మన్‌కు రాజీనామా సమర్పించగా.. ఆయన రాజీనామాను ఆమోదించారు.

కాగా పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బి.ఆర్.ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుమారుడు రాజేష్‌కు కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించుకొని నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో ప్రధాన పాత్రను పోషించారు. ఎన్నికలకు ముందే తన పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలి అని అనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేసి ఎమ్మెల్సీగా యథావిధిగా కొనసాగుతున్నాడు. ఎన్నికల అనంతరం దామోదర్ రెడ్డి కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆశించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగేందుకు పరిస్థితులు మెరుగుపడ్డాయి. దీనితో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తండ్రి ఎమ్మెల్సీ.. కొడుకు ఎమ్మెల్యేగా కార్యక్రమాలకు హాజరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

పోటీకి ఆసక్తి చూపుతున్న తాజా మాజీలు :

ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయినా ఎమ్మెల్సీ స్థానం నుండి పలువురు ముఖ్య నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు అధికార పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కొందరు ఎమ్మెల్సీ పదవులపై ఆశతోనే పార్టీ మారలేదు. అనూహ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు పరాజయం పాలు కావడంతో ఖాళీగానున్న ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీ చేసేందుకు తాజా మాజీలు సైతం అవకాశం వస్తే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒకరిద్దరూ మాజీలు ఇప్పటికే తమ అనుచరుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌కు కొంత కలిసి రావచ్చు కానీ .. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన అనంతరం నిర్వహిస్తే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడం బీఆర్‌ఎస్ నుండి పోటీ చేయాలని ఆశిస్తున్న వారికి అంత సులభతరం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed