తెలంగాణ నుంచి పోల్ మేనేజ్ మెంట్.. బోర్డర్ నుంచి బీజేపీ స్పెషల్ ఆపరేషన్!

by GSrikanth |
తెలంగాణ నుంచి పోల్ మేనేజ్ మెంట్.. బోర్డర్ నుంచి బీజేపీ స్పెషల్ ఆపరేషన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ప్రచార ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం నుంచి మైకులు మూగబోనున్నాయి. ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేపట్టాయి. అయితే ఇన్ని రోజులు చేపట్టిన ప్రచారం ఒక ఎత్తు.. ప్రచారం ముగిశాక ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో పోల్ మేనేజ్ మెంట్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధం కానున్నాయి. కాగా ఈ అంశంలో బీజేపీ ఒకడుగు ముందుకేసింది. పక్కా స్కెచ్ తో ప్రత్యర్థులను చిత్తు చేయాలని వ్యూహరచన చేసుకుంది. ప్రచార పర్వం సోమవారంతో ముగియనుండటం, ఎన్నికల కోడ్ నేపథ్యంలో అందరూ అక్కడి నుంచి వెనుదిరగాల్సి ఉంటుంది. అందుకే బీజేపీ కర్ణాటక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి పోల్ మేనేజ్ మెంట్ చేయాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

తెలంగాణ నుంచి పోల్ మేనేజ్ మెంట్...

కన్నడ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోరు హోరాహోరీగా సాగనుంది. కాంగ్రెస్ వ్యూహాలను చిత్తుచేసేలా బీజేపీ ప్లాన్ చేసింది. కర్ణాటక రాష్ట్రానికి ఆనుకుని ఉన్న తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వద్ద బీజేపీ జాతీయ నేతలు ఉండి ఎప్పటికప్పుడు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించాలని నిర్ణయించారు. కర్ణాటక ఎన్నికల వ్యూహాన్ని తెలంగాణ బోర్డర్ నుంచి అమలు చేయనుంది. ఈ వ్యూహంతో తెలంగాణ సరిహద్దున ఉన్న దాదాపు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ప్లస్ కానుంది. కర్ణాటకలో అధికారాన్ని తిరిగి దక్కించుకునేందుకు కేంద్ర మంత్రుల నుంచి మొదలు జాతీయ స్థాయి లీడర్లను కూడా అక్కడే మోహరించేలా ప్రణాళిక రచించుకుంది. కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వం ముగిశాక ఓటర్లను ప్రభావితం చేసేలా తెలంగాణ సరిహద్దుల్లో భారీ సభను నిర్వహించాలని కాషాయ పార్టీ తొలుత భావించింది. అనుకున్నట్లుగా జరిగితే సభను 9వ తేదీన నిర్వహించాలని ప్రాథమికంగా అనుకున్నా చివరకు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

పలు ప్రాంతాల ఎంపిక..

కన్నడ ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షితులను చేసేందుకు తెలంగాణలోని జహీరాబాద్, తాండూరు, నారాయణపేట, అనంతపూర్ ను ఎంచుకున్నట్టు సమాచారం. ఎందుకంటే జహీరాబాద్‌కు సమీపాన బీదర్, తాండూరుకు దగ్గర్లో చించోలి, నారాయణపేట వద్ద రాయచూర్, అనంతపూర్‌కు సమీపంలో బళ్లారి ఉండటమే ఇందుకు కారణం. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాలనూ బీజేపీ ఎంచుకుంది. అగ్రనేతలంతా సరిహద్దుల్లో నుంచే పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీయనున్నారు. కన్నడ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలు ఎంతమేరకు ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Advertisement

Next Story