కార్మిక క్షేత్రంలో ఖల్ నాయక్ గ్యాంగుల కలకలం..

by Sumithra |
కార్మిక క్షేత్రంలో ఖల్ నాయక్ గ్యాంగుల కలకలం..
X

దిశ, గోదావరి ఖని : కార్మిక క్షేత్రం గోదావరిఖనిలో యువత కత్తులతో సహవాసం చేస్తున్నారు. ఖల్ నాయక్ గ్యాంగుల్లా గ్రూపులు కడుతూ కక్షలు పెంచుకుంటున్నారు. పగలు ప్రతీకారాలతో రగులుతూ పబ్లిక్ గా దాడులు చేసుకుంటున్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించినా మాటు వేసి మారణ హోమం సృష్టిస్తున్నారు. మంది మార్బలంతో వచ్చి కత్తులు తల్వార్లతో సినిమాను తలపించేలా హత్యలు చేస్తూ కార్మిక క్షేత్రంలో కలకలం సృష్టిస్తున్నారు. వరుస ఘటనలతో హడలెత్తిస్తుండతో జనం భయం గుప్పిట్లో మగ్గుతూ కాలం వెల్లదీస్తున్నారు.

కార్మిక క్షేత్రంలో ఖల్ నాయక్ గ్యాంగులు..

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో యువత వక్రమార్గం పడుతున్నారు. ఖల్ నాయక్ గ్యాంగులు కట్టి కన్నవారిని కంటతడి పెట్టిస్తున్నాయి. కత్తులతో సహవాసం చేసి అదే కత్తులకు బలైపోతున్నారు. పగలు ప్రతికారాలతో రగులుతూ గ్యాంగులుగా తన్నుకుంటూ చెడు మార్గాన్నే నమ్ముకొని జైలు పాలవుతున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మోసం చేయడం, కొట్టుకోవడం, చంపుకోవడం, తలలు నరకడం ఇక్కడ యువతకు కామన్ గా తయారైంది. యువకులు గ్యాంగ్ గా తిరగడం రౌడీయిజం చేయడం.. అమ్మాయిలను వేధించడం.. అడ్డు వచ్చిన వారిని తొలగించడం ఇక్కడి యువకులకు అదో ఫ్యాషన్ గా మారింది. మర్డర్ చేసిన వారితో యువకులు స్నేహం చేయడం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తు హంగామా చేయడం ఇక్కడ సహజంగా మారింది. వీరంతా గంజాయి, సిగరెట్లు, మందు తాగుతూ చోటా మోటా నాయకుల పంచన చేరడం అది వారి స్టేటస్ గా చూపించుకోవడం ఇక్కడ ప్యాషన్ విద్యార్థి దశలోనే చదువును పక్కనపెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో తల దూరుస్తూ కన్నవారికి భారంగా మారుతున్నారు. ఇలా మారిన యువకులతో కార్మిక క్షేత్రం కల్లోల ప్రాంతంగా మారుతుంది.

పగ ప్రతీకారాలతో పట్టపగలే పబ్లిక్ గా..

చిన్ననాటి నుంచి కలిసి తిరిగి ఎన్నో తప్పులు చేసిన వారు ఇద్దరు మధ్యలో తేడా వస్తే పట్టపగలే చంపుకుంటున్నారు. స్నేహానికి ఎంత విలువిస్తారో, తేడా వస్తే అంతే కక్షతో తలలు నరికేసుకుంటున్నారు. పోలీసులు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తే అది ప్రత్యేక అర్హతగా యువతను పోగేస్తూ రక్తచరిత్ర సృష్టిస్తున్నారు. చంపటమా.. చావడమా ? ఏదో ఒక్కటి తేలాలి అంటూ పబ్లీక్ గా కత్తులతో ప్రతి దాడులకు దిగుతున్నారు. ఆధిపత్యం కోసం చిన్న చిన్న విషయాలకే చంపుకుంటున్న ఘటనలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి. పెండ్లి బారాత్ లో వచ్చిన గొడవలు నీ అంతు చూస్తా నిన్ను ఎట్టి పరిస్థితుల్లో చంపుతానని బెదిరించడంతో పుట్టిన రోజునే చంపేసుకోవడాలు. అదును చూసి మాటు వేసి నడిరోడ్డులో చౌరస్తాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఉండంగానే కత్తులతో కర్కశంగా నరికి చంపేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గోదావరిఖని ప్రాంతంలో ఇప్పుడు కామన్ గా మారిపోయాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పోలీసులు కఠినంగా వ్యవహరించినా మారని పరిస్థితి..

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా ఇక్కడ పరిస్థితి మారడం లేదు. యువత చెడుకు ఆకర్షితులై మద్యం గంజాయి మత్తులో తూలుతూ ఖల్ నాయక్ గ్యాంగులు కడుతున్నారు. ఎంత మంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినా జైళ్లకు పంపినా ఇక్కడ క్రైమ్ రేట్ తగ్గటం లేదు. జైళ్ల నుండి బయటకు రాగానే ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని యువతను పోగేసుకుంటున్నారు. వారిని వెంట తిప్పుకుంటూ రీల్స్ చేస్తు ఆకట్టుకుంటున్నారు. ఇలా తయారైన గ్యాంగులో చిన్న చిన్న విషయాలకు రక్తపాతం సృష్టిస్తూ కార్మిక క్షేత్రంలో కలకలం సృష్టిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed