కార్మికుల బతుకులు క్వారీల్లో శిథిలం

by Aamani |
కార్మికుల బతుకులు క్వారీల్లో  శిథిలం
X

దిశ, శంకరపట్నం : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్వారీల్లో కార్మికుల జీవితాలు శిథిలమవుతున్నాయి. అడ్డగోలుగా సహజ సంపదను కొల్లగొట్టి గ్రానైట్ వ్యాపారులు మాత్రం రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. కట్టడి చేయాల్సిన మైనింగ్, కార్మికశాఖ అధికారులు గ్రానైట్ వ్యాపారులు ఇచ్చే తాయిలాలకు తలొగ్గి వ్యవస్థను వారికి తనఖా పెడుతున్నారు. దీంతో అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘిస్తున్న గ్రానైట్ మాఫియా కార్మిక చట్టాలను బేఖాతరు చేస్తూ కార్మికుల జీవితాలను గ్రానైట్ క్వారీల్లో శిథిలం చేస్తున్నారు. తాజాగా శంకరపట్నం మండలంలోని క్వారీల్లో జరిగిన ఈ సంఘటనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం గా నిలుస్తోంది. శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా గ్రానైట్ కంపెనీ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదివారం రాత్రి కొత్తగట్టు గ్రామంలో గల ఓ క్వారీలో ఇటాచ్చి జేసీబీ సహాయంతో బండలను తొలగిస్తుండగా ఇటాచ్చి వాహనం తలకిందులైంది. దీంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన కార్మికుడిని కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. రాత్రి, పగలు తేడా లేకుండా గోరంత అనుమతులతో కొండలను పిండి చేస్తున్నారు. గతంలో కూడా కొత్తగట్టు గ్రామంలో నిర్వహిస్తున్న ఓ క్వారీలో ఓ కార్మికుడి కంట్లో స్టోన్ కట్టర్ పౌడర్ పడినట్లు తెలిసింది. దీంతో గుట్టు చప్పుడు కాకుండా కార్మికుడి ఘటన దాచిపెట్టి కార్మికుని నోరును డబ్బుతో మూయించినట్లు సమాచారం. ఆదివారం రాత్రి జరిగిన సంఘటనతో క్వారీ లో పనిచేసే కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన సంఘటనను కప్పిపుచ్చడానికి క్వారీ యజమానులు ప్రయత్నించినప్పటికీ గాయాలు తీవ్రంగా కావడంతో బయటకు పొక్కింది.

Advertisement

Next Story

Most Viewed