బీసీవాదం బలపడేనా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బిగ్​ ఫైట్​?

by Anjali |
బీసీవాదం బలపడేనా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే బిగ్​ ఫైట్​?
X

దిశ, కరీంనగర్​ బ్యూరో: పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ వాదం రోజురోజుకు బలపడుతోంది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు టికెట్​ కేటాయించాలని అన్ని పార్టీల నుంచి డిమాండ్​ వస్తోంది. నియోజకవర్గంలో అధికంగా బీసీలు ఉన్నందువల్ల వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ టికెట్​ బీసీలకు ఇవ్వాలని డిమాండ్​ ఇటీవల కాలంలో తెరమీదకొచ్చింది. 1952లో ఏర్పడిన నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెడ్డి, వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు గెలుపొందారు. 1952లో పీడీఎఫ్​ పార్టీ నుంచి పోటీ చేసిన ముత్తయ్య బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా 1962లో జరిగిన ఎన్నికల్లో బుట్టి రాజారాం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం విశేషం.

తరువాత వరుసగా జరిగిన ఎన్నికల్లో 1967, 1972లో జిన్న మల్లారెడ్డి, 1978లో గొట్టెమక్కుల రాజిరెడ్డి, 1983లో గోనే ప్రకాష్‌రావు, 1983లో జరిగిన ఉప ఎన్నికల్లో గీట్ల ముకుందరెడ్డి, 1985లో కాల్వ రాంచంద్రారెడ్డి, 1989లో గీట్ల ముకుందరెడ్డి, 1994లో బిరుదు రాజమల్లు బీసీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత 1999లో గుజ్జుల రామకృష్ణారెడ్డి, 2004లో గీట్ల ముకుందరెడ్డి, 2009లో విజయరమణారావు, 2014, 2018లో దాసరి మనోహర్​ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

బీసీ నినాదం..

పెద్దపల్లిలో ఈసారి బీసీ నివాదం తెరపైకి వచ్చింది. అధికార బీఆర్​ఎస్​తోపాటు కాంగ్రెస్​, బీజేపీల నుంచి బీసీలు టికెట్లు ఆశీస్తున్నారు. అధికార పార్టీ సిటింగ్​ ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డి ఉండగా ప్రస్తుతం జూలపల్లి జెడ్పీటీసీగా ఉన్న బొద్దుల లక్ష్మణ్​ బీసీ కోటాలో తనకు పెద్దపల్లి బీఆర్​ఎస్​ టికెట్​ కావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా కేసీఆర్​ సేవాదళం పేరుతో నియోజకవర్గంలో సేవ కార్యక్రమాలు చేపడుతున్నారు. తనకు పార్టీ పెద్దల అండ ఉందని, వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్​ వస్తుందని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్​ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు టికెట్​ ఆశీస్తుండగా ఓదెల జెడ్పీటీసీ గంట రాములు బీసీ కోటాలో తనకు పెద్దపల్లి టికెట్​ కావాలని పట్టుపడుతున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో టికెట్​ ఇస్తానని హమీ ఇస్తే పార్టీలో చేరుతామని ఇటీవల హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. చేరికలకు ఓకే అన్న ఈటల టికెట్​పై ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో వారి చేరికలకు బ్రేక్​ పడింది.

బీఎస్​పీ నుంచి టికెట్​ కన్​ఫాం..

వచ్చే ఎన్నికల్లో బీఎస్​పీ టికెట్​ బీసీ అభ్యర్థికి దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​కు అతి దగ్గర వ్యక్తి దాసరి హనుమయ్య, అతడి కూతురు దాసరి ఉషాను పెద్దపల్లి బరిలో నిలుపాలని బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడిచిన రెండేళ్లుగా నియోజకవర్గంలో విసృతంగా పర్యటిస్తూ బీఎస్పీ పార్టీని బలోపేతం చేసే పనిలో హనుమయ్య, ఉషాలు నిమగ్నమయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ నుంచి బీసీ అభ్యర్థిగా దాసరి ఉష ఎన్నికల బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏడుసార్లు బీసీలకు టికెట్లు..

పెద్దపల్లి శాసనసభకు ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు నిర్వహించగా రెండుసార్లు మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు. ఒక్కసారి ఎస్సీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. రాజకీయ పార్టీలు ఏడుసార్లు టికెట్​ ఇచ్చి బీసీలకు అవకాశం కల్పించగా రెండుసార్లు మాత్రమే బీసీలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఇందులో ఒక్కరు మత్తయ్య కాగా మరొకరు బిరుదు రాజమల్లు ఎమ్మెల్యేలుగా నిలిచారు. ప్రస్తుతం పెద్దపల్లి నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా వినిస్తున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో బీసీల మధ్య ఐక్యత లేకపోవడంతో బీసీ వాదం బలపడుతుందా..? లేదా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story