గురుకుల విద్యకు రూ.6వేల కోట్లు వెచ్చిస్తున్నాం: మంత్రి కేటీఆర్

by Shiva |
గురుకుల విద్యకు రూ.6వేల కోట్లు వెచ్చిస్తున్నాం: మంత్రి కేటీఆర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: కులమేదైన.. మతమేదైన.. గురుకులాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలో మైనారిటీ సంక్షేమ శాఖ, ఎమ్మెల్యే నిధులు రూ.1.10కోట్లతోనిర్మించిన ముస్లిం షాదీఖానను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు వేయికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఏటా గురుకుల విద్యపై రూ.6వేల కోట్లకు పైగా నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా మైనారిటీ విద్యార్థుల కోసం 204 గురుకులను ఏర్పాటు చేశామన్నారు. గురుకుల పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్ధిపై ఏటా రూ.1.20 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. ముస్లిం షాదీఖానను వెంటిలేటర్ల తో అందంగా నిర్మించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఎనిమిదిన్నరేళ్లలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జేఎన్టీయూ కళాశాల సహా అనేక కళాశాలలు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓవర్సీస్ విద్యా నిధి కింద విదేశాల్లో ఏడు వేల మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేస్తున్న రాష్ట్రం తెలంగాణేనని తెలిపారు.

ఆశాలకు అత్యధిక వేతనాలిస్తున్నది తెలంగాణే

ఆశా వర్కర్లకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగణేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కంటే ఎక్కువగా వేతనాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆశా వర్కర్లను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని స్పష్టం చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ క్లాస్‌ రూం, సోలార్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు.అదేవిధంగా టౌన్ క్లబ్ ఆవరణ లో ఏర్పాటు చేసిన సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. సిరిసిల్ల పట్టణంలో IDOC సమీపంలో రగుడు కూడలి అభివృద్ధికి రూ.7.70కోట్లతో బైపాస్ కూడలి అభివృద్ధి, సుందరీకరణ, బైపాస్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అరుణా రాఘవరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed