అసంపూర్తిగా మినీ ట్యాంక్ బండ్.. ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని పనులు

by Mahesh |
అసంపూర్తిగా మినీ ట్యాంక్ బండ్.. ఏళ్లు గడుస్తున్నా పూర్తికాని పనులు
X

దిశ, మంథని : మంథని తమ్మచెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు మిషన్ కాకతీయ కింద చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఏళ్లు గడిచినా పూర్తి కాకపోవడంతో వాటి పని ఇంకా అంతేనని అధికారులే చెప్పడం గమనార్హం. మంథని తమ్మ చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మార్చేందుకు 2016లో ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద రూ.3.60కోట్లు మంజూరు చేసింది. ఆయకట్టు లేని ఈ నీటి వనరును పట్టణవాసులకు ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

కాగా, గుత్తేదారు నిర్లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి కాలేదు. గడువు పెరిగినా అదే పరిస్థితి కొనసాగింది. రూ.2.15 కోట్లతో చెరువులో పూడికతీత, కట్ట నిర్మాణం, రివట్మెంట్, మత్తడి, నాలుగు చోట్ల మెట్ల నిర్మాణం వంటి పనులు చేశారు. కట్టకు ఇరువైపులా రక్షణ గోడలను నిర్మించారు. రెయిలింగ్ పనులు చేపట్టలేదు. 2019 జూలై వరకు పనులన్నీ పూర్తి కావాల్సిన ఆచరణకు నోచుకోలేదు.

మిగతా పనులు అంతేనటా..

మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంలో భాగంగా రూ.18 లక్షలతో మూడు చోట్ల స్వాగత తోరణాలు, రూ.10 లక్షలతో బోటింగ్ జెట్టి, రూ.10 లక్షలతో విద్యుదీకరణ, రూ.3 లక్షలతో గార్డు రూమ్ నిర్మించాలని నిర్ణయించారు. కానీ అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యంతో ఇవేవీ సకాలంలో పూర్తి కాలేదు. స్వాగత తోరణాలు, గార్డు రూమ్ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. మిగతా పనుల ఊసే లేకుండా పోయింది. గుత్తేదారుకు అనారోగ్యం వల్ల చేసిన పనుల మేరకు బిల్లులు చెల్లించామని, మిగతా పనులు ఇక అంతేనని నీటిపారుదల శాఖ ఏఈ తిరుపతి తెలిపారు.

జరిగిన పనుల్లోనూ నాణ్యత లోపం..

ట్యాంక్ బండ్ నిర్మాణంలో భాగంగా జరిగిన పనుల్లోనూ నాణ్యత కొరవడింది. కట్టకు ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడ, మెట్లు పగుళ్లు వచ్చాయి. చాలాచోట్ల పగుళ్లు నాణ్యతను వెక్కిరిస్తున్నాయి. రేగడి భూమి కావడంతో పగుళ్లు వచ్చాయని అధికారులు చెప్పడం కోసమెరుపు.

Advertisement

Next Story

Most Viewed