మంథని నియోజకవర్గ బీఆర్ఎస్‌లో టికెట్​ పోరు

by Mahesh |   ( Updated:2023-05-30 02:37:29.0  )
మంథని నియోజకవర్గ బీఆర్ఎస్‌లో టికెట్​ పోరు
X

దిశ, కాటారం: అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అభ్యర్థికి మాత్రమే అవకాశం ఇస్తుంది. ఒకరిద్దరు బలమైన అభ్యర్థులు ఉంటే ఒకరిని సముదాయించి మరొకరికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. మంథని అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇది అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఆరు నెలల ముందు వరకు టికెట్ ఆశించేవారు అసలు ఉండరు అనుకున్న నేపథ్యంలో క్రమక్రమంగా అసంతృప్తి వాదం బలపడుతోంది. మంథని నియోజకవర్గంలో అధికార పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్​ఛార్జ్, పెద్దపెల్లి జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఒక్కరే అభ్యర్థి అని అనుకున్నాను.

2014 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్​అభ్యర్థి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన పుట్ట మధు కాంగ్రెస్​ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పుట్ట మధుకర్ జెడ్పీటీసీగా పోటీచేసి పెద్దపెల్లి నుంచి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి మంథనిలో అన్నీ తానై పనిచేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గ బీఆర్ఎస్‌లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో యాగం నిర్వహించి అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో నారాయణరెడ్డి తన గేర్ మార్చి స్పీడ్ అందుకున్నారు.

నియోజకవర్గం అంతా పర్యటిస్తూ వివాహాలు, శుభకార్యాలు, పరామర్శలు ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్ కోసం రాష్ట్రస్థాయిలో అగ్రనేత అండదండలతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంథని బీఆర్ఎస్ ఇన్‌చార్జి పుట్ట మధు వర్సెస్ నారాయణ రెడ్డి లో ఎవరికి టికెట్​వస్తుందా అనే చర్చ నియోజకవర్గం లో మొదలైంది. గతంలో కీర్తిశేషులు శ్రీపాదరావుపై అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసి 1200 ఓట్ల తేడాతో ఓడిపోయిన బెల్లంకొండ నర్సింగరావు నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లోలో సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైనా గెలుపు కోసం కృషి చేయాలని పోటీ చేసే అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పారు.

గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్రు నాగయ్య ఇటీవల పుట్ట మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరారు. అతని చేరిక పైన అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఏమి ప్రచారం చేసినా చివరకు టికెట్ తనదేనని పుట్ట మధు అన్నీ తానై ఆత్మీయ సమ్మేళనాలు, పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్‌లో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను చైతన్యం చేస్తూ తనకే అవకాశం కల్పించాలని పుట్ట మధు కోరుతున్నారు. మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మూడోసారి రాబోయే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని, దుష్ప్రచారాలను నమ్మవద్దని పుట్ట మధు పేర్కొంటున్నారు.

చల్లా తీవ్ర ప్రయత్నాలు?

కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి సీఎం కేసీఆర్‌కు దగ్గరి బంధువు అండదండలతో మంథని నుంచి బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని నాయకులు, కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగిస్తున్నారు. నారాయణరెడ్డి బీఆర్ఎస్ టికెట్ పై పెద్ద చర్చ ప్రారంభమైంది. ఆత్మీయ సమ్మేళనాల్లో నారాయణరెడ్డి పై చేసిన విమర్శలు ఇతరత్రా అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.

రంగంలోకి పార్టీ ఇంటెలిజెన్స్?

మంథని నియోజకవర్గం అధికార పార్టీలో ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల సంఖ్య పెరుగుతుండడంతో అధిష్టానం అప్రమత్తమై నట్లు తెలుస్తోంది. ఒకరికి టికెట్ ఇస్తే మిగతావారు ఆగ్రహంతో బయటకు వెళ్లే అవకాశం ఉండడంతో అధిష్టానం స్వయంగా బరిలోకి దిగినట్లు సమాచారం. సొంత పార్టీ ఇంటెలిజెంట్ తో టికెట్ ఆశిస్తున్న నేతలు వారికి టికెట్ ఇవ్వకపోతే ప్రత్యామ్నాయం ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed