పీఏసీఎస్ చైర్మన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!

by Mahesh |
పీఏసీఎస్ చైర్మన్ పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!
X

దిశ, తిమ్మాపూర్ : మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఉన్న తిమ్మాపూర్ మండలంలో అధికార పార్టీలో ముసలం రాజుకుంది. సొంత పార్టీ డైరెక్టర్లే తిరుగుబావుటా ఎగురవేసి సింగిల్ విండో అధ్యక్షుడిపై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తిమ్మాపురం మండలంలోని నుస్తులాపూర్ సహకార సంఘం అధ్యక్షుడికి అవిశ్వాస గండం మొదలైంది.

ఆది నుంచి అసమ్మతే..

ఈ సొసైటీ కింద తిమ్మాపూర్, గన్నేరువరం మండలాలు ఉండగా 13 డైరెక్టర్ స్థానాలు ఉన్నాయి. 13 మందిలో ఏడుగురు గన్నేరువరం మండల డైరెక్టర్లు కాగా, తిమ్మాపూర్ మండలం నుంచి ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. మొదట ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గుజ్జుల రవీందర్ రెడ్డి పేరును అధ్యక్ష స్థానానికి సూచించినట్లు తెలిసింది. కానీ అప్పట్లో ఏడుగురు డైరెక్టర్లున్న గన్నేరువరం మండల నాయకులు ఏకమై ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి ఎన్నికైన ఆలువాల కోటిని అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నారు. ఈ ఎంపిక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది.

పదవీ కాలంపై రహస్య ఒప్పందమే బెడిసి కొట్టిందా..?

గన్నేరువరం నుంచి ఉన్న ఏడుగురు డైరెక్టర్లలో సగం కాలం కోటి, మరో సగం కాలం అధ్యక్షుడిగా ఉండాలని ఒప్పందం కీలక డైరెక్టర్‌ మొదట చేసుకున్నట్లు సమాచారం. కాగా, మూడేళ్లు గడిచినప్పటికీ ఒప్పందం ప్రకారం కోటి రాజీనామా చేయకపోవడంతో కొందరు కీలక డైరెక్టర్లు అవిశ్వాసానికి రంగం సిద్ధం చేసి 11 మంది డైరెక్టర్లు క్యాంపునకు వెళ్లినట్లు తెలిసింది. అలవాల కోటి తో పాటు పారువెల్లకి చెందిన ఒక డైరెక్టర్ అవిశ్వానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. 13 మందిలో తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీకి చెందిన ఒకరు, రేణి‌కుంట నుంచి ఒకరు, ఇందిరానగర్ ఒకరు, పర్లపల్లిలో ఒకరు, మొగిలిపాలెంలో ఒకరు, కొత్తపల్లిలో ఒకరు ఉంన్నారు.

అలాగే గన్నేరువరం మండలంలోని జంగపల్లిలో ఒకరు, గునుకుల కొండాపూర్‌లో ఒకరు, కాసింపెట్‌లో ఒకరు, మాదాపూర్ ఒకరు, మైలారం ఒకరు, పారువెళ్ల ఒకరు, గన్నేరువరం నుంచి ఒకరు డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిలో మొగిలి పాలెం, కొత్తపల్లి డైరెక్టర్ స్థానాలకు పోటీ కాగా, మిగతా 11 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. గునుకుల కొండాపూర్ ఎస్సీ రిజర్వ్ కావడంతో అలువాల కోటి పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికై అధ్యక్షుడు అయ్యాడు. కాగా, సొంత పార్టీ డైరెక్టర్లే అధ్యక్షుడిపై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తుండగా అసమ్మతి నాయకులకు ఎమ్మెల్యే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed