సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

by Sridhar Babu |
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు.

పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకొని 10/10 సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి సన్మానించారని తెలిపారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల ప్రమోషన్స్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్ర్తవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. మిగితా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

జిల్లా నుంచి జాతీయ స్థాయికి తాడురి సంపత్ కుమార్, రాష్ట్ర స్థాయికి పాకాల శంకర్ ఎంపిక కాగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విప్ కోరారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ తన బాల్యం నుంచి ఈ స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దిన టీచర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలను అన్ని అంశాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. సామాజిక, పర్యావరణ స్పృహ, నైతికత, విలువలు, పోటీతత్వం నేర్పించాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా విద్యాధికారి రమేష్, జీసీడీఓ పద్మజ, ఎంఈఓలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed