ఎన్నికల సన్నద్దత పై పకడ్బందీ ప్రణాళిక తయారు చేయాలి.. జిల్లా కలెక్టర్

by Sumithra |
ఎన్నికల సన్నద్దత పై పకడ్బందీ ప్రణాళిక తయారు చేయాలి.. జిల్లా కలెక్టర్
X

దిశ, పెద్దపల్లి కలెక్టరేట్ : జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నద్ధత కార్యక్రమాలను పకడ్బందీగా పూర్తి చేయాలని, ఎన్నికల నిర్వహణ ప్రణాళిక తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్దత పై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ వి.లక్ష్మీ నారాయణతో కలిసి తహసీల్దార్ లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని, దీనికోసం సంపూర్ణ సమాచారంతో సిద్ధం కావాలని అన్నారు.

రెండవ విడత ఓటర్ నమోదు కార్యక్రమం కోసం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే జూన్ 23 లోగా పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికి కొన్ని మండలాల్లో 15 నుంచి 20 శాతం మాత్రమే ఇంటింటి సర్వే జరగడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బూత్ స్థాయి అధికారులను తహసీల్దార్ లు ప్రతిరోజు పర్యవేక్షించాలని, రోజు ఉదయం, సాయంత్రం ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

ఇంటింటి సర్వే నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న ఇండ్ల సంఖ్య, సర్వే చేసిన ఇండ్లు, కొత్తగా నమోదు చేయాల్సిన ఓటర్లు, శాశ్వతంగా తొలగించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటరు కార్డులో సవరణలు మొదలగు అంశాల పై నివేదికలను ఈ.ఆర్‌.ఒ నెట్ ద్వారా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలు, వారికి అందించిన నోటీసులు, తదితర పూర్తి సమాచారం సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటరు జాబితా సవరణలో వచ్చిన దరఖాస్తులు, వాటి పై తీసుకున్న చర్యల పై నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా సేకరించిన వివరాలను బీఎల్ఓ యాప్ లో నమోదు చేసేలా చూడాలని అన్నారు.

రామగుండం నియోజకవర్గం పరిధిలో 10వేలకు పైగా ఓటర్ల తొలగింపు జరిగినందున వాటి వివరాలను మరోసారి ధృవీకరించాలని సూచించామని, క్షేత్రస్థాయి ధృవీకరణ ప్రక్రియ పై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు. రామగుండంలో అధికంగా ఫోటో సిమిలర్ ఎంట్రీ లనుతొలగించామని, వాటిని సైతం ధృవీకరించాలని అన్నారు. ఓటరు జాబితాలో ఒక ఇంటిలో 6 కంటే అధికంగా ఓట్లు ఉంటే ప్రత్యేకంగా పరిశీలించి ధృవీకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దివ్యాంగులు, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్లకు ఓటు హక్కు కల్పన కోసం చేసిన ప్రత్యేక కార్యక్రమాలను వివరించాలని తెలిపారు.

ప్రతి మండలంలో పోలింగ్ కేంద్రాల వివరాలను సమర్పించాలని, పోలింగ్ కేంద్రాలలో ఉన్న మౌళిక వసతులు, దివ్యాంగుల కోసం చేసిన ఏర్పాట్లు, త్రాగు నీటి సౌకర్యం, విద్యుత్, టాయ్లెట్ సౌకర్యం ఉన్నదా లేదా పరిశీలించాలని, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, తదితర అంశాలపై నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్లను మ్యాపింగ్ చేయాలని, సెల్ ఫోన్ సిగ్నల్ రాని పోలింగ్ కేంద్రాల వివరాలు సమర్పించాలని అన్నారు. ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కె.వీర బ్రహ్మ చారి, తహసీల్దార్ లు, ఎన్నికల డీటీ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed