- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవినీతికి అడ్డగా గన్నేరువరం తహశీల్దార్ ఆఫీస్.. అధికారిపై కేసు
దిశ బ్యూరో, కరీంనగర్: ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారడం లేదు. తప్పులు చేస్తే కటకటాల పాలవుతామన్న భయమే లేదు. కొందరు అధికారులు లంచాలకు అలవాటుపడి నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. డబ్బులకు ఆశపడి తమకు ఉన్న అధికారాన్ని అవినీతి పనులకు ఉపయోగిస్తున్నారు. అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అసలు వారసులకు కాకుండా వేరొకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేసి అధికారులు నిజమైన వారసులను ఇబ్బందులు పెడుతున్నారు. అటువంటి ఘటన గన్నేరువరం మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. అధికారులు లంచాలు తీసుకొని అనర్హులకు సర్టిఫికెట్ జారీ చేశారని బాధితురాలు వాపోతోంది. అయితే ఈ విషయమై గన్నరువరం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారిపై ఫేక్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్ల జారీ...
కుటుంబ యజమాని మరణించినప్పుడు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని వారసత్వ ధ్రువీకరణగా కూడా పరిగణిస్తారు. కుటుంబ యజమానికి సంబంధించి స్థలాలు, ఆస్తుల బదలాయింపు ఇతర అవసరాల నిమిత్తం ఈ సర్టిఫికెట్‌ను స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో అప్లై చేసుకుని తీసుకుంటారు. ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం కార్యాలయాల్లో అప్లై చేస్తున్న అధికారులు విచారణ చేపట్టి సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు అవినీతి అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకుండా ఇష్టానుసారం డబ్బులు వసూలు చేస్తూ అసలు వారసులను పక్కనపెడుతున్నారు. ఆ కుటుంబంలోని దగ్గర బంధువులకు సర్టిఫికెట్లు ఇస్తూ కుటుంబీకుల మధ్య చిచ్చురేపుతున్నారు. అధికారులు అన్నీ తెలిసే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారా? లేదా నేతల ప్రలోభాలకు లొంగి అనర్హులకు వారసత్వ పత్రాలను జారీ చేసి ఆస్తుల పంపకంలో తగాదాలు సృష్టించాలనుకుంటున్నారా? అనేది తెలియడం లేదు.
గన్నేరువరంలో మరొకరికి సర్టిఫికెట్..
గన్నేరువరం మండల రెవెన్యూ అధికారులు అసలు వారసులను పక్కనపెట్టి మరొకరికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆలస్యంగా నిజం తెలుసుకున్న అసలు వారసులు సర్టిఫికెట్‌పై అధికారులను ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పలేదని వాపోయారు. దీంతో బాధితులు జరిగిన విషయాన్ని ఆర్డీవోకు చెప్పడంతో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కుటుంబంలో చిచ్చుపెట్టి ఇష్టానుసారం సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై ఉన్నతాధికారులు స్పందించి సస్పెండ్ చేయాలని బాధితులు కోరుకుంటున్నారు.
బాధితురాలు కొయెడ వనిత తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మల్లయ్య, లచ్చవ్వలకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు జాలిగం బాలవ్వ, 2వ కూతురు కొయెడ వనిత, కొడుకు లింగంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అయితే ముగ్గురిలో తమ పెద్దక్క జాలిగం బాలవ్వ, తన తమ్ముడు లింగంపల్లి శ్రీనివాస్ చనిపోయినట్లు 2వ కూతురు వనిత తెలిపారు. ఇదివరకు తమ తండ్రి, తల్లి అందరు చనిపోయారు. ఇక ఉన్నది తాను మాత్రమే ఉన్నానని వాపోయింది. వారసురాలిని అయిన తాను ఉండగా మా అక్క కొడుకుకు తన పేరు మీద తనకు తెలియకుండానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను గన్నేరువరం తహసీల్దార్ జారీ చేశారని వాపోయింది. ఇదేంటీ సారు నా ప్రమేయం లేకుండా నా సంతకంతో ఎవరు తీసుకున్నారని అడిగితే సమాధానం చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రైట్ ఇన్ ఫర్మేషన్ యాక్టుతో రెవెన్యూ ఆఫీస్‌లో వారసత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎవరు తీసుకున్నారని సర్టిఫైడ్ కాపీ కావాలని కోరడంతో సంబంధం లేని వ్యక్తికి ఇచ్చినట్టు అధికారికంగా తనకు తెలిపినట్లు వాపోయింది. అయితే ఈవిషయమై తాను గన్నేరువరం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారిపై తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.