గుప్పుమంటోన్న గుడుంబా.. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు

by Shiva |
గుప్పుమంటోన్న గుడుంబా.. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
X

దిశ, మంథని: మంథని మండల పరిధిలోని పలు గ్రామాల్లో నాటుసారా (గుడుంబా) గుప్పుమంటోంది. బెల్ట్ షాపులు అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతున్నాయి. ప్రతి గల్లీకి ఓ బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. పట్టణంతో పాటు గ్రామాల్లో ఈ విచ్చలవిడిగా నడుస్తోంది. బెల్ట్ షాప్‌లతో గ్రామాల్లో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అవుతున్నాయి. మద్యం ప్రియుల నుంచి నిర్వాహకులు అందినకాడికి దోచుకుంటున్నారు. పొద్దంతా కష్టం చేసి సాయంత్రం పూట రిలాక్స్ అయ్యేందుకు కొందరు మద్యం సేవిస్తుంటారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని బెల్ట్ షాప్ నిర్వాహకులు యథేచ్ఛగా లిక్కర్‌ను ఇష్టం వచ్చి రేట్లకు అమ్ముతూ దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కుటుంబాలు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా బెల్ట్ షాపులు నడవడంతో జనం అంతా మద్యానికి బానిసగా మారుతున్నారు. దీంతో వారంతా అనారోగ్యం బారిన పడి అప్పుల పాలు అవుతున్నారు.

మత్తుకు బానిసవుతున్న యువత..

గ్రామాల్లో గల్లీ గల్లీకో బెల్ట్ షాపులు వెలుస్తుండడంతో యువకులు మద్యానికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అప్పులు చేసి మరి అధిక ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి ఇబ్బందుల పాలవుతున్నారు. బెల్ట్ షాపుల్లో వేకువజామున మద్యం దొరుకుతుండడంతో మండల వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది.

నాటు సారా అమ్మితే కఠిన చర్యలు

ఎవరైనా బెల్ట్ షాపులను నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా నాటుసారి అమ్మిన వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. కేసులు కూడా నమోదు చేస్తున్నాం. బెల్ట్ షాపుల గురించి తమ దృష్టికి ఎవరైనా తీసుకువస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. గుడుంబా నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టాం. వైన్ షాపులకు అన్నింటికీ పర్మిట్ రూంలు ఉన్నాయి. అక్కడ ఏమైనా సౌకర్యాలు లేకపోతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

- రాకేష్, మంథని ఆబ్కారీ సీఐ

ప్రాణాలు తీస్తున్న నాటుసారా

గ్రామల్లో నాటుసారాకు అలవాటు పడి పేద ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అదే విధంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడవడం మూలంగా ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం మద్యానికి ఖర్చు పెడుతూ ఆర్థికంగా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా యువత నాటుసారా మద్యానికి బానిసై తమ అమూల్యమైన జీవితాలను కోల్పోతున్నారు. వీటిని అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా నాటుసారాను పూర్తి స్థాయిలో అరికట్టి బెల్ట్ షాపులను ఎత్తి వేయాలని మహిళలు కోరుతున్నారు. అదేవిధంగా మంథని పట్టణంలోని వైన్ షాపుల్లో నిర్వహిస్తున్న పర్మిట్ రూంలలో సరైన కనీస సౌకర్యాలు లేక కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. - బూడిద గణేష్, వ్యసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

Advertisement

Next Story

Most Viewed