ఓసీపీ 5 పేలుళ్లపై హైకోర్ట్ లో పిల్!

by Javid Pasha |   ( Updated:2023-02-04 13:27:50.0  )
ఓసీపీ 5 పేలుళ్లపై హైకోర్ట్ లో పిల్!
X

దిశ, గోదావరి ఖని: సింగరేణిలో కొత్తగా ఏర్పడిన ఓసీపీ 5 లో ఓబీ మట్టి వెలికి తీసేందుకు వాడుతున్న బ్లాస్టింగ్ ల వల్ల ఇళ్లు బీటలు వారుతున్నాయని, దుమ్ము ధూళి పైకి లేచి శ్వాస కోశ వ్యాధులు తలెత్తుతున్నాయని, చర్మవ్యాధులు ప్రబలుతున్నాయని ప్రభావిత కాలనీవాసులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు సింగరేణి అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఫిర్యాదు దారులు మద్దెల దినేష్, నరేందర్, కాలనీ వాసులు శనివారం మీడియాతో మాట్లాడారు. ఓసీపీ ప్రాజెక్టు లేకపోతే ఈ ప్రాంతమే మనుగడనే లేదంటూ బూటకపు మాటలు చెప్పి ఓసీపీ 5ని ప్రారంభించారని ఆరోపించారు. ఓసీపీ 5 ప్రారంభంత తమ ప్రాంతాన్ని దుమ్ము ధూళి కప్పేస్తున్నాయని చెప్పారు. దీనితో ప్రజలు అనేక రకాల రోగాల బారినపడుతున్నారని, ముఖ్యంగా శ్వాసకోశ, గొంతునొప్పి, దగ్గ, జలుబు లతో పాట అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా భారీ బ్లాస్టింగ్ల వల్ల చుట్టు పక్క గ్రామాల్లో ఇండ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, నూతన టెక్నాలజీతో తమ ఇళ్లకు ఎలాంటి ప్రమాదం లేదని సింగరేణి అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సమయంలో మాయమాటలు చెప్పారని మండిపడ్డారు.


ఎలాంటి శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఉండవని చెప్పి ఇప్పుడు తమను పట్టించుకోవడం లేదని సింగరేణి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే తమ ప్రాంతం ఉనికికే ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. తమ ప్రాంతాన్ని బొందల గడ్డగా మార్చేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఓసీపీ 5 వల్ల ప్రజలు ఇబ్బంది పడుతోంటే స్థానిక ఎమ్మెల్యే కనీసం ఒక్కసారి కూడా తమ బాధలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అవినీతి కుంభకోణం, కాంట్రాక్టులు, కమీషన్లకు కక్కుర్తి పడుతూ స్వలాభం కోసం పర్యటిస్తుంటారని అని ఫైర్ అయ్యారు. తమ గోడును డీజీఎమ్ఎస్ కు చెబితే తూతూ మంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఆర్జీవన్ జీఎం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కలిసి వినతి పత్రం ఇస్తే.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఈ క్రమంలోనే తామంతా హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఓసీపీ 5 సమస్య పై తాము వేసిన రిట్ పిటిషన్ (నెంబర్ (WP NO) 3143/2023)ను హైకోర్టు స్వీకరించిందని పేర్కొన్నారు. ఈ కేసును వచ్చే సోమవారం విచారణకు చేపట్టనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed