LMD project : నాడు జల కళ..నేడు వెలవెల..

by Sumithra |
LMD project : నాడు జల కళ..నేడు వెలవెల..
X

దిశ, తిమ్మాపూర్ : గత ఏడాది పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడిన దిగువ మానేరు జలాశయం ప్రస్తుతం వెలవెలబోతున్న వైనమిది. ఈసారి ఎల్ఎండి ప్రాజెక్ట్ పరిధితో పాటు దీనికి ప్రధాన నీటి వనరులుగా ఉన్న ప్రాంతాల్లో కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో ప్రాజెక్టులోకి ఈసారి ఇంకా వరద మొదలు కాకపోవడం ప్రాజెక్టు వెలవెల పోవడానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. సరిగ్గా ఏడాది క్రితం ఎల్ఎండి జలాశయం నిండుకుండలా మారి ఎల్ఎండి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసే పరిస్థితి ఉండగా.. ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. దిగువ ఆయకట్టు పరిధిలోని దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల పంటలకు వరప్రదాయనిగా మారిన ఎల్ఎండి ప్రాజెక్ట్ ఈసారి ఇంకా జలకళను సంతరించుకోకపోవడంతో ప్రాజెక్టును నమ్ముకొని సాగుకు సిద్ధమవుతున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఎల్ఎండి జలాశయ ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితి పై 'దిశ' ప్రత్యేక కథనం.

నాడు జల కళ..నేడు వెలవెల..

గత సంవత్సరం జులై మాసంలోనే ఎల్ఎండి ప్రాజెక్ట్ ప్రధాన నీటి వనరుల పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. అంతేకాకుండా ఎగువ ప్రాంతాల నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద రావడంతో ఆ నెల 27వ తేదీన మిడ్ మానేరు జలాశయం నుంచి 1.10 లక్షల క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపు 90 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఆరోజు రాత్రికి ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 24 టీఎంసీలలో 20 టీఎంసీలకు చేరుకుంది. అలాగే వరద ఉధృతి పెరుగుతుండడంతో ప్రాజెక్టు మొత్తం 20 గేట్లలో 16 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. కాగా ప్రస్తుతం జులై మాసం ముగుస్తున్న తరుణంలో ప్రాజెక్టులోకి ఇంకా నీరు రాకపోవడం రైతుల్లో ఆందోళనకు కారణం అవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను కేవలం 5 టీఎంసీల నీటి నిల్వతో వెలవెలబోతుంది.

వరద రాకుంటే సాగు ప్రశ్నార్థకమే..

ఎల్ఎండి ప్రాజెక్టును నమ్ముకుని దిగువ ఆయకట్టు పరిధిలోని కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో దాదాపు 4.50 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుండగా.. ఈసారి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండకపోతే సాగు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు నిల్వ ఉండకపోతే దిగువ ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీరు అందించే పరిస్థితి ఉండకపోవచ్చని ప్రాజెక్ట్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.



Next Story