- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'వారిని ఓ కంట కనిపెట్టాలి.. ఆత్మహత్యల నివారణపై స్పెషల్ నజర్'
దిశ, కరీంనగర్ బ్యూరో: కీలెరిగి వాత పెట్టాలన్న నానుడిని అక్షరాల నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి పోలీసులు. నొప్పి ఒక చోట ఉంటే మందు మరోచోట రాసే విధానం కాకుండా మూలాలు వెతికి మరీ ప్రజల్లో చైతన్యం నింపేందుకు సమాయత్తం అయ్యారు. రామగుండం కమిషనరేట్‌లోని పెద్దపల్లి జిల్లాలో వ్యాపారులు, ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు పోలీసులు నడుం బిగించారు. పెరిగిపోతున్న ఆత్మహత్యలను నిలువరించేందుకు కారణాలను వెతికిన పోలీసు అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.
పురుగుల మందు తాగుతూ..
ఇటీవల కాలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు అత్యంత సాధారణం గా మారిపోయాయి. మానసిక ఒత్తిళ్లతో పాటు చిన్నచితకా కారణాలతో బలవణ్మరణానికి పాల్పడి కానరాని లోకాలకు వెళుతూ.. కుటుంబాలను రోడ్డున పడేస్తున్న వారు కొందరైతే, తల్లిదండ్రలు కలల ఆశల సౌధాలు కూల్చుతున్న వారు మరికొందరు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటూ నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు తనువు చాలించేందుకు ఎంచుకుంటున్న మార్గాలు ఎన్నెన్నో. ఇందులో ఎక్కువ మంది విపణి వీధిలో లభ్యమవుతున్న పురుగుల మందులను తాగి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో పెరిగిపోయిన పురుగుల మందు తాగి చనిపోతున్న వారి సంఖ్యను గమనించిన పోలీసు అధికారులు నిలువరించాలని భావించారు. పెస్టిసైడ్స్ తాగి చనిపోతున్న వారిలో ఎక్కువ మంది కూడా గడ్డిని అంతమొందించేందుకు వాడే మందులను తాగుతున్నారని, ఇది తాగిన వారిలో ఎక్కువ మంది చనిపోతున్నారని గుర్తించారు. ఈ విషయంపై డాక్టర్లతో కూడా చర్చించిన పోలీసు అధికారులు గడ్డిని నాశనం చేసేందుకు వాడుతున్న వివిధ రకాల మందులే ఇందుకు కారణమని చెప్పారు.
చనిపోయిన వారిని పోస్ట్ మార్టం చేసిన తర్వాత గడ్డి మందు తాగిన వారి శరీరం లోపలి భాగాలు ఎలా నాశనం అవుతున్నాయి, వారు ఎంత త్వరగా చనిపోతున్నారు అన్న విషయాలను డాక్టర్లు సమీక్షించారు. దీంతో ఇతర పురుగుల మందులకు గడ్డి మందుకు ఉన్న తేడాను గుర్తించి వాటిని మానసిక సంఘర్షణలకు గురవుతున్న వారికి విక్రయించకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 18న జరిగిన రామగుండం కమిషనర్ చంద్ర శేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఈ అంశం గురించి చర్చించారు. ఇక నుండి గడ్డి మందు విక్రయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించడంతో పెద్దపల్లి డీసీపీ రూపేష్ ప్రజల్లో చైతన్యం నింపేందుకు అవసరమైన తీసుకునేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు ఏసీపీ సారంగపాణి నేతృత్వంలో పోలీసు అధికారులు వ్యవసాయానికి ఉపయోగపడే పెస్టిసైడ్స్ వ్యాపారుల వివరాలను సేకరించి వారికి అవగాహన కల్పించే పనిలో నిమగ్నం అయ్యారు.
వారిని ఓ కంట కనిపెట్టాలి..
వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసేందుకు నిత్యం రైతులు, వారి కుటుంబాలకు చెందిన వారు వస్తుంటారు. వ్యాపారులు కూడా పంటలకు పడుతున్న చీడపీడలను తొలగించుకునేందుకే పెస్టిసైడ్స్ కొనుగోలు చేసుకునేందుకు వస్తున్నారని భావించి అమ్ముతున్నారు. పురుగుల మందులు కొనుగోలు చేసిన వారిలో కొంతమంది తమ సమస్యలను తట్టుకోలేక అవి తాగి చనిపోతున్నారు. ఇందులో గడ్డిని నాశనం చేయడానికి ఉపయోగించే పలు రకాల పురుగుల మందులకు ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగింది. గతంలో పంట చేలల్లో పుట్టుకొచ్చే గడ్డిని, కలుపుమొక్కలను కూలీలచే తొలగించేవారు. దీనివల్ల ఎక్కువ ఖర్చు వెచ్చించాల్సి వస్తుండడం, కూలీల కొరత కూడా తీవ్రంగా ఉండడంతో రైతులు కూడా గడ్డిని నాశనం చేసే మందును పిచికారి చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాపారులు కూడా గడ్డి మందు కావాలి అనగానే ఠక్కున రైతులకు అమ్ముతున్నారు. అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్‌ను మిక్స్ చేసి తయారు చేస్తున్న ఈ గడ్డి మందు తాగిన వారు విగతజీవులుగా మారిపోతున్నారు.
దీంతో ఇక నుండి వ్యాపారులు అలాంటి వారిపై ఓ కన్నేసి ఉంచాలని గడ్డి మందు కావాలని వచ్చే వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన తరువాతే విక్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో పాటు అనుమానంగా కనిపించిన వారిని గమనించి వారి గురించి సంబంధిత స్టేషన్‌కు సమాచారం ఇస్తే ఆత్మహత్యలకు పాల్పడే వారేనని నిర్ధారణ అయితే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసు అధికారులు సమాయత్తం అవుతున్నారు. గడ్డి మందు తాగి చనిపోయే వారిని ముందుగానే గుర్తించినట్లయితే ఆత్మహత్యలను నిలువరించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిని వెంటనే పరలోకానికి పంపించేందుకు దోహదపడుతున్న గడ్డి మందు వారి చేతికి చిక్కకుండా మొదట్లోనే చెక్ పెడితే అన్ని విధాలా మంచిదని భావించే వ్యాపారులు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు శ్రీకారం చుట్టామని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ముందు ముందు ప్రజల్లోనూ గడ్డి మందు ఎంత ప్రమాదకరమైందో వివరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.