- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాషాయం కండువా కప్పుకోనున్న గులాబీ నేత..?

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కారు పార్టీని వీడి కమలం పార్టీలో చేరనున్నట్లు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మంతనాలు పూర్తి కాగా, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తెరవెనుక చక్రం తిప్పుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరగా రమేష్ బాబు పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ మధ్యకాలంలో పౌరసత్వ వివాదం తప్పితే ఆయనపై నియోజకవర్గంలో ఎలాంటి చర్చ జరగడం లేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలో రమేష్ బాబు ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల రమేష్ బాబు వేములవాడ పర్యటన కొత్త చర్చకు దారి తీసింది. దీనికి తోడు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కొంతమంది ముఖ్య నాయకులతో రమేష్ బాబు నివాసంలో కలవడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను మళ్లీ వస్తున్నట్లు రమేష్ బాబు కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం, ఆయన బీజేపీలో చేరుతున్నాడని విషయానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే రమేష్ బాబు అతి త్వరలో కాషాయం కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన కేసీఆర్..
రమేష్ బాబు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తిరుగులేని నాయకుడిగా చరిత్ర సృష్టించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ పౌరసత్వ వివాదం నేపంతో రమేష్ బాబుని కాదని వేములవాడ బీఆర్ఎస్ టికెట్ చల్మెడ లక్ష్మీనరసింహారావుకు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో రమేష్ బాబు అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు, పార్టీకి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గత ఏడాదిన్నరగా జర్మనీలోనే ఉంటూ దాదాపు రెండు మూడు సార్లు మాత్రమే ఇండియాకు వచ్చినట్లు సమాచారం. చాలా రోజుల తర్వాత ఆయన ఇటీవల వేములవాడ పర్యటనకు రావడం నియోజకవర్గంలో కొత్త చర్చకు దారితీసింది.
ఆదికి చెక్ పెట్టేందుకే..
నాలుగుసార్లు రమేష్ బాబు చేతిలో చిత్తుగా ఓటమిని చవిచూసిన ఆదిశ్రీనివాస్‌ను నియోజకవర్గం ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించి ఎమ్మెల్యే పట్టం కట్టారు. అయితే నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అనునిత్యం ఆయన వారికి అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆదిశ్రీనివాస్‌కు నియోజకవర్గ ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరి ఆదిశ్రీనివాస్‌కు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మారనున్న రాజకీయ సమీకరణాలు..
రమేష్ బాబు బీజేపీలో చేరితే వేములవాడలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలో పెను మార్పులు సంభవించనున్నాయి. రోజుకో పరిణామంతో రాజకీయ స్థితిగతులు భిన్నంగా మారడంతోపాటు పార్టీలలో కుదుపులు తప్పవని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊహించని అనుభవాలు ఎదురవుతాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. రమేష్ బాబు బీజేపీలో చేరుతున్నాడనే విషయం ఇప్పుడు నియోజకవర్గంలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.